Share News

మళ్లీ తెరపైకి..

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:52 PM

Grading system ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చే విధానాన్ని విద్యాశాఖ మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. ఉపాధ్యాయుల ప్రతిభను అంచనా వేసి ఏ,బీ,సీ,డీ గ్రేడ్‌లను ఇవ్వనుంది. 2017లో గ్రేడింగ్‌ విధానంలో ఉపాధ్యాయుల బదిలీల్లో అదనపు పాయింట్లు ఇచ్చారు. ఈసారి గ్రేడింగ్‌ విధానం ద్వారా ఉపాధ్యాయుల బదిలీల్లో అదనపు పాయింట్లతో పాటు విద్యావ్యవస్థను బలోపేతానికి భాగస్వామ్యం చేయనున్నారు.

మళ్లీ తెరపైకి..

ఉపాధ్యాయులకు గ్రేడింగ్‌ విధానం

అభ్యుదయ ప్రగతి కోసం ప్రభుత్వ సంకల్పం

విద్యార్థులు సామర్థ్యాలు ఆధారంగా గుర్తింపు

ఇందుకోసం కేపీఐ, జీఎఫ్‌ఎల్‌ఎన్‌ సర్వేలు

నరసన్నపేట, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చే విధానాన్ని విద్యాశాఖ మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. ఉపాధ్యాయుల ప్రతిభను అంచనా వేసి ఏ,బీ,సీ,డీ గ్రేడ్‌లను ఇవ్వనుంది. 2017లో గ్రేడింగ్‌ విధానంలో ఉపాధ్యాయుల బదిలీల్లో అదనపు పాయింట్లు ఇచ్చారు. ఈసారి గ్రేడింగ్‌ విధానం ద్వారా ఉపాధ్యాయుల బదిలీల్లో అదనపు పాయింట్లతో పాటు విద్యావ్యవస్థను బలోపేతానికి భాగస్వామ్యం చేయనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసేందుకు టీచర్‌ కీలక పనితీరు సూచన(కీ ఫెర్ఫార్మేషన్‌ ఇండికేటర్స్‌- కేపీఐ) సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే ఉపాధ్యాయుల బోధన నాణ్యత, విద్యార్థుల సామర్థ్యం, పాఠశాల లక్ష్యసాధనలో వారి సహకారాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు డైట్‌ విద్యార్థులు, సీఆర్‌పీల సహాయంతో విద్యార్థులకు జీఎఫ్‌ఎల్‌ఎన్‌(గ్యారెంటీ ఫౌండేషన్‌ లెర్నింగ్‌ న్యూమారీస్‌) సర్వే నిర్వహిస్తారు. లీప్‌ యాప్‌ద్వారా తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. మళ్లీ మూడు నెలల తర్వాత మరో సర్వే నిర్వహించి.. విద్యార్థుల సామర్థ్యాల మేరకు ఉపాధ్యాయులకు గ్రేడింగ్‌ ఇస్తారు. ఉన్నత పాఠశాలలోనూ ఇదే విధానం అమలు చేస్తారు. పదోతరగతి బోధించే ఉపాధ్యాయులకు.. ఫలితాలు కొలమానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

సర్వే ప్రయోజనాలు ఇవీ

పాఠశాలల్లో మెరుగైన భోదన, లక్ష్యసాధనలో ఉపాధ్యాయుల సహకారం, పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ఈ సర్వే ప్రధాన ఆశయం. అభ్యసన ఫలితాలు పెంపొందించేందుకు దోహదపడుతుంది. గ్రేడింగ్‌ విధానం పారదర్శకంగా ఉంటుంది. కష్టపడే ఉపాధ్యాయులకు గుర్తింపునిస్తుంది. పనితీరులో వెనుకబడినవారిని గుర్తించి.. మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల మదింపు కూడా పారదర్శకంగా ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఒక డైట్‌ విద్యార్థి, సీఆర్‌పీ, సచివాలయ సిబ్బంది కలిసి పాఠశాలలు, తరగతులు వారీగా చదవడం, నెంబర్లును గుర్తించడం వంటి అంశాలు యాప్‌లో చూస్తూ విద్యార్థులు వాటిని గుర్తించాల్సి ఉంటుంది. విద్యార్థులు చెప్పే దానిని రికార్డు చేసి సామర్థ్యాన్ని అక్కడికక్కడే మదింపు చేస్తుంది. ఈ విధానంతో ఉపాధ్యాయులకు గ్రేడింగ్‌ పారదర్శకంగా ఇచ్చేందుకు దోహదపడుతుంది.

జిల్లాలో 2,067 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 450 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1,34,885 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 12వేలమందికిపైగా ఉపాధ్యాయులు బోధన సాగిస్తున్నారు. ఉపాధ్యాయులు పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌ విధానం.. కొందరికి ఆమోదంకాగా.. మరికొందరు మాత్రం దీనిపై గుర్రుగా ఉన్నారు. గ్రేడింగ్‌ విధానంతో విద్యాప్రమాణాలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉంటాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. బోధనేతర కార్యక్రమాల భారం తగ్గించి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంటున్నారు.

బోధనేతర కార్యక్రమాలు వద్దు

ఉపాధ్యాయులకు గ్రేడింగ్‌ ఇవ్వడం మంచిదే. ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయులకు బోధన చేసేందుకు తగినంత సమయం ఇవ్వాలి. యోగా డే, మెగా పేరెంట్స్‌ డే వంటి వేడుకలు ద్వారా మూడేసి రోజుల బోధన సమయం తగ్గుతోంది. బోధనేతన కార్యక్రమాలకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం దిశగా అడుగులు వేయాలి. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడ్ని నియమించాలి .

- బమ్మిడి శ్రీరామమూర్తి, యూటీఎఫ్‌, జిల్లాప్రధాన కార్యదర్శి

సామర్థ్యాలు ఒకేలా ఉండవు

ఉన్నత పాఠశాలల్లో సిలబస్‌ గుదిబండగా తయారైంది. అంత సిలబస్‌ను బోధించేందుకు సమయం చాలడం లేదు. విద్యార్థుల సామర్థ్యాలు ఒకేలా ఉండవు. ఉపాధ్యాయులు బోధన, విద్యా లక్ష్యాల సాధనలో చేస్తున్న కృషి ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వాలి.

- బుద్దల కేశవరావు, గణితం ఉపాధ్యాయుడు, సత్యవరం ఉన్నత పాఠశాల

Updated Date - Dec 03 , 2025 | 11:52 PM