జీపీఎస్ పనిచేయట్లే!
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:56 PM
Grain trucks crash at mills ధాన్యం విక్రయించేందుకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల మంది రైతులు వరికోతలు పూర్తిచేశారు. సుమారు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాలుగు రోజుల కిందట సర్వర్ మొరాయించడంతో గంటలపాటు నిరీక్షించారు.
మిల్లుల వద్ద ధాన్యం ట్రక్కులతో పడిగాపులు
తరచూ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
ఆందోళన చెందుతున్న రైతులు
నరసన్నపేట, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):
జమ్ము గ్రామానికి చెందిన సాదు రామారావు అనే రైతు.. 55 ధాన్యం బస్తాలను విక్రయించేందుకు గత నెల 23న షెడ్యూల్ తీసుకున్నారు. ట్రక్కు షీటు కోసం వారం రోజులు పాట్లు పడ్డారు. సోమవారం ఉదయం ట్రక్కుషీటు రాగానే.. ధాన్యాన్ని మిల్లు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మిల్లర్ లాగిన్‌లో ట్రక్కు షీటు కనిపించలేదు. దీంతో ధాన్యంతో వాహనం మిల్లు వద్ద నిలిచిపోయింది.
..ఇలా ధాన్యం విక్రయించేందుకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల మంది రైతులు వరికోతలు పూర్తిచేశారు. సుమారు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాలుగు రోజుల కిందట సర్వర్ మొరాయించడంతో గంటలపాటు నిరీక్షించారు. చివరికి కళ్లాల్లో ధాన్యం భద్రపరిచారు. ఆదివారం సెలవు కావడంతో.. సోమవారం మిల్లులకు ధాన్యం తీసుకెళ్దామని భావించారు. తుఫాన్ ప్రభావంతో చిరుజల్లులు పడగా ధాన్యం కాపాడుకునేందుకు పాట్లు పడ్డారు. సోమవారం జీపీఎస్ సాంకేతిక సమస్య తలెత్తింది. మంగళవారం మధ్యాహ్నం వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మిల్లుల వద్ద నిరీక్షణ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జనరేట్ అయిన ట్రక్కుషీట్లు.. మిల్లర్ల సైట్‌లో వాహనాలు చేరినట్టు చూపించడం లేదు. దీంతో మిల్లుల వద్ద ధాన్యం లోడులతో వాహనాలు నిలిచిపోతున్నాయి. జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాల నుంచి సుమారు 1600 మంది రైతులు ధాన్యం విక్రయించేందుకు సోమవారం ట్రక్కుషీటు తీసుకున్నారు. జీపీఎస్ కలిగిన వాహనాల్లో ధాన్యం లోడింగ్ చేపట్టి మిల్లులకు తీసుకువచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్కుషీటు జనరేట్ అయిన వివరాలు.. మిల్లుల వద్ద గల కస్టోడియన్ అధికారి(వీఆర్వో) లాగిన్‌లో కన్పిస్తున్నాయి. రైతు కళ్లాల నుంచి వాహనం మిల్లు వద్దకు చేరిన తరువాత మిల్లు యొక్క జీపీఎస్.. వాహనం యొక్క జీపీఎస్ అనుసంధానమై రైస్ మిల్లర్ యాజమాని లాగిన్ కన్పించాలి. కానీ సోమవారం మధ్యాహ్నం నుంచి ఆ వివరాలు కనిపించకపోవడంతో మిల్లులు వద్ద వాహనాలు నిలిచిపోయాయి. మిల్లర్ లాగిన్‌లో రైతుల ట్రక్కు షీటు కనిపిస్తే ధాన్యం దించుతామని మిల్లర్లు చెప్పడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నాలుగు రోజులుగా మిల్లు వద్దే ఇబ్బందులు పడుతున్నామని కరగాం, కంబాయి, నారాయణవలస, అంపలాం, నర్సింగపల్లి గ్రామాలకు చెందిన రైతులు వాపోతున్నారు. వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయడంతో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని రైతులు గొండు చలపతి, కోల కృష్ణారావు, తోట చిన్నవాడు, కడపు లక్ష్మణరావులు ఆరోపించారు. ధాన్యం కొనుగోలు పక్రియలో లోపాలను సరిదిద్దాలని రైతులు కోరుతున్నారు.
సమన్వయలోపం
ధాన్యం కొనుగోలు పక్రియ అంతా సివిల్ సప్లయ్ శాఖ పర్యవేక్షణ ఉండగా, వాహనాలు జీపీఎస్ విధానం.. అనుసంధానం పక్రియ వంటి సాంకేతిక పరమైన అంశాలను థర్డ్‌పార్టీకి అప్పగించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం కావాలంటే ఈ రెండు శాఖలకు చెందిన అధికారులు, సాంకేతిక సిబ్బంది.. సమన్వయంతో సాగాలి. కానీ సమన్వయం లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
లోపాలు సరిదిద్దుతాం
మిల్లర్లు లాగిన్‌లో వాహనాలు చేరినట్లు కనిపించకపోవడం వాస్తవమే. దీనిపై జీపీఎస్ సాంకేతిక సిబ్బందికి సమాచారం ఇచ్చాం. ఇతర జిల్లాల మిల్లులకు వెళ్లినట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. లోపాలను సరిదిద్ది రైతులు ఇబ్బంది లేకుండా చూస్తాం.
- వేణుగోపాలరావు, డీఎం, సివిల్‌సప్లయ్‌శాఖ, శ్రీకాకుళం