Share News

రైతులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:36 AM

‘రైతులు వ్యవసాయంలో నూతన విధానాలు అవలంభించి అధికదిగుబడులు సాధించాలి. వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.’అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు.

  రైతులకు అండగా ప్రభుత్వం
అన్నదాత సుఖీభవ పథకం చెక్కును రైతులకు పంపిణీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే రమణమూర్తి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- పంట మార్పిడి విధానం లాభసాటి

- జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాసరావు

- ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధులు జమ

నరసన్నపేట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘రైతులు వ్యవసాయంలో నూతన విధానాలు అవలంభించి అధికదిగుబడులు సాధించాలి. వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.’అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం రెండో విడత కార్యక్రమాన్ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారని, దీనివల్ల గిట్టుబాటురాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సూచించారు. మొక్కజొన్న సాగుతో ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చునన్నారు. ఉద్యానవన పంటలతో పాటు వాణిజ్య పంటలను సాగు చేస్తే ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. యాంత్రీకరణ సాగుతో అధిక దిగుబడులను సాధించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తుందని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 2.79 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.184కోట్లు జమైనట్లు తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో రైతాంగం ఆలోచనలో మార్పు రావాలన్నారు. వరి సాగుతో పాటు అరటి, చెరకు, పామాయిల్‌, మొక్కజొన్న, కూరగాయాల పంటలు సాగు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని పెంచాలన్నారు. నత్రజని వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. వరిలో తాను ఎకరాకు 45 బస్తాలు దిగుబడి సాధించినట్లు తెలిపారు. ఏడాదికి రూ.20వేలు సాయం చేసి రైతులకు పెద్దన్నలా సీఎం చంద్రబాబునాయుడు నిలుస్తున్నారని అన్నారు. అనంతరం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం చెక్కును పంపిణీ చేశారు. మార్కెటింగ్‌ శాఖ క్యాలండర్‌ను అవిష్కరించారు. ముందుగా ప్రకృతి వ్యవసాయం సాగు, డ్రోన్ల వినియోగం తదితర స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యాక్రమంలో రాష్ట్ర కనీస వేతన సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి వ్యవసాయశాఖ అధికారి కె.త్రినాథస్వామి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రసాద్‌, ఆర్డీవో సాయి ప్రత్యూష, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కాళింగ , పొందరి కార్పొరేషన్ల చైర్మన్లు రోణంకి కృష్ణంనాయుడు, దామోదర నర్సింహులు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పాగోటి ఉమామహేశ్వరి, రాగోలు వరిపరిశోధన శాస్త్రవేత్త ఉదయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:36 AM