Share News

మరో 409 రోజులు

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:47 PM

Moolapet port జిల్లాలోని ప్రతిష్టాత్మక మూలపేట(గతంలో భావనపాడు) గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(పోర్ట్స్‌)శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు(జీఓ ఆర్టీ 94) జారీ చేశారు.

మరో 409 రోజులు

మూలపేట పోర్టు నిర్మాణ గడువు పెంచిన ప్రభుత్వం

ఎలాంటి జరిమానా లేదని స్పష్టీకరణ

శ్రీకాకుళం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతిష్టాత్మక మూలపేట(గతంలో భావనపాడు) గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(పోర్ట్స్‌)శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు(జీఓ ఆర్టీ 94) జారీ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పోర్టు పనుల పూర్తికి కాంట్రాక్టు సంస్థకు 2026 నవంబరు 30 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి ఒప్పందం ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 17 నాటికి పనులు పూర్తిచేయాలి. కానీ వివిధ కారణాల రీత్యా పనులు ఆలస్యం కావడంతో మరో 409 రోజులపాటు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కారణాలివే...

విశ్వసముద్ర పోర్ట్స్‌ (జేవీ) సంస్థ ఈ ప్రాజెక్టును రూ.2,949.70 కోట్ల వ్యయంతో దక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 17 నాటికి 60.49 శాతం భౌతిక పనులు, 56.28 శాతం ఆర్థిక పురోగతి మాత్రమే సాధించారు. ప్రతికూల వాతావరణం, తుఫాన్‌లు, ముడి ఖనిజాల(మైనర్‌ మినరల్స్‌) సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు, పునరావాస(ఆర్‌అండ్‌ఆర్‌) సమస్యల వల్ల సైట్‌ అప్పగించడంలో జాప్యం వంటి కారణాలు.. పనుల ఆలస్యానికి దారితీశాయని అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ అంశాలను పరిశీలించిన టెండర్‌ ఎవాల్యుయేషన్‌ కమిటీ సిఫారసుల మేరకు గడువు పెంపునకు ఆమోదం లభించింది. జాప్యానికి సంబంధించి కాంట్రాక్ట్‌ సంస్థపై ఎటువంటి లిక్విడేటెడ్‌ డ్యామేజెస్‌(జరిమానా) విధించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో గడువు పొడిగించినందుకు కాంట్రాక్టు సంస్థ ఎలాంటి అదనపు ఖర్చులను క్లెయిమ్‌ చేయకూడదని షరతు విధించింది. దీనికి అంగీకరిస్తూ నిర్మాణ సంస్థ ఇప్పటికే అండర్‌టేకింగ్‌ ఇచ్చినట్లు ఉత్తుర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:47 PM