Ampuram-Ghati road: జీవో సరే.. నిధులేవీ?
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:55 PM
Unreleased funds for Ampuram-Ghati road కంచిలి మండలం అంపురం నుంచి ఘాటి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరులో జాప్యమవుతోంది. సుమారు ఏడు నెలల కిందట ఉత్తర్వులు జారీచేసినా ఇంతవరకూ నిధులు మంజూరు కాకపోవడంతో రహదారి పనులు చేపట్టడం లేదు.
అంపురం-ఘాటి రహదారికి విడుదలకాని డబ్బులు
తాత్కాలిక మరమ్మతుల పేరిట ప్రజాధనం వృథా
కంచిలి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): కంచిలి మండలం అంపురం నుంచి ఘాటి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరులో జాప్యమవుతోంది. సుమారు ఏడు నెలల కిందట ఉత్తర్వులు జారీచేసినా ఇంతవరకూ నిధులు మంజూరు కాకపోవడంతో రహదారి పనులు చేపట్టడం లేదు. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా.. నిధులు వృథా అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే అంపురం నుంచి ఘాటి వరకు సుమారు 11 కిలోమీటర్ల ప్రఽదాన రహదారి పూర్తిగా గోతులమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం ఏదో ఒకచోట వాహనాలు అదుపుతప్పి, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రహదారి మీదుగా సుమారు 11 పంచాయతీల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కంచిలి మండలంలోని అంపురం, కర్తలి, ఎం.ఎస్.పల్లి, కొల్లూరు, ముండల, కేబీనౌగాం, ఎక్కల, బెల్లుపడ, డీజీ పురం, పోలేరు, భైరిపురం పంచాయతీల ప్రజలు ఈ రహదారి గుండా కంచిలి మండల కేంద్రానికి, సోంపేట ఇతర ప్రదేశాలకు రాకపోకలు సాగించాలంటే ఇదే ప్రధాన మార్గం. పక్కనే ఉన్న ఒడిశా ప్రాంతానికి ఇదే రహదారి వెంట వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. కాగా రహదారి ఎక్కడికక్కడ గోతులమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ రహదారి నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర ప్రభుత్వం సీఆర్‌ఐఎఫ్ నిధులు (సెంట్రల్ రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) రూ.23కోట్లు మంజూరుకు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రహదారి నిర్మాణం జరిగి, తమ ఇబ్బందులు తొలగిపోతాయని ఈ ప్రాంతవాసులు భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను కేంద్రానికి ఇప్పటివరకూ పంపించకపోవడంతో నిధులు విడుదల కాలేదు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
రూ.లక్షలు వెచ్చించి తాత్కాలికంగా గోతులు పూడ్చినా కొన్నిరోజుల తర్వాత పరిస్థితి షరామామూలే. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జనవరి మధ్య అంపురం నుంచి రెండు కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు రూ.8 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. అలాగే రెండు కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల పరిధిలోని నారాయణబట్టి వరకు మరమ్మతులకు మరో రూ.25 లక్షలు మంజూరు చేశారు. కాగా మొదటి రెండు కిలోమీటర్ల మరమ్మతులను సంబంధిత కాంట్రాక్టర్ పూర్తి చేయకపోవడంతో నిధులు విడుదల చేయలేదు. రెండో దశ పనులకు బిల్లులు చెల్లించారు. ఆయా పనులు జరిగిన నాలుగు నెలలకే రోడ్డు మళ్లీ యథాస్థితికి వచ్చి గోతులమయం కావడం గమనార్హం. రహదారి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక మరమ్మతుల కారణంగా నిధులు వృథా అవుతున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈఈ(సోంపేట) దిక్కల విక్రం వద్ద ప్రస్తావించగా.. ‘అంపురం - ఘాటీ రహదారి నిర్మాణానికి సంబందించిన టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. మరమ్మతులకు సంబంధించి సగం పనులు పూర్తయ్యాయ’ని తెలిపారు.