గొండూరు గుట్ట.. స్వాహా
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:08 AM
Invasions in Loharibandha ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. అక్రమార్కులు కన్నేస్తున్నారు. కొండ, చెరువు, గుట్ట, కాలువ.. కాదేది ఆక్రమణకు అనర్హం అన్న చందంగా కబ్జాకు పాల్పడుతున్నారు. జిరాయితీ భూముల్లా సాగు చేస్తున్నారు. మందస మండలం లోహరిబంద పంచాయతీలో యశోదనగర్ వద్ద గొండూరు గుట్ట పేరుతో 50 ఎకరాల కంకర మెట్టను ఇదే తరహాలో చెరబడుతున్నారు.
లోహరిబందలో ఆక్రమణల పర్వం
45 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
రెండు చెరువులు కూడా..
చోద్యం చూస్తున్న అధికారులు
హరిపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. అక్రమార్కులు కన్నేస్తున్నారు. కొండ, చెరువు, గుట్ట, కాలువ.. కాదేది ఆక్రమణకు అనర్హం అన్న చందంగా కబ్జాకు పాల్పడుతున్నారు. జిరాయితీ భూముల్లా సాగు చేస్తున్నారు. మందస మండలం లోహరిబంద పంచాయతీలో యశోదనగర్ వద్ద గొండూరు గుట్ట పేరుతో 50 ఎకరాల కంకర మెట్టను ఇదే తరహాలో చెరబడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే సుమారు 45 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆక్రమిత స్థలంలో పశువుల పాకలు, షెడ్డులు, పేరిట చిన్నచిన్న గుడిసెలు నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆరేళ్లుగా ఆక్రమణ పర్వం కొనసాగుతున్నా.. అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.
మందస మండలం లోహరిబంద పంచాయితీ పరిధిలో గొండూరు గుట్ట పేరుతో సర్వే నెంబరు110లో 50 ఎకరాల కంకర మెట్ట విస్తరించి ఉంది. బీడు ప్రాంతంలో ముళ్లపొదలుతో నిండిన ఈ ప్రాంతాన్ని అప్పటి రెవెన్యూ అధికారులు గుర్తించగా.. 1993లో టీడీపీ ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ తల్లి యశోదమ్మ పేరుతో ఇక్కడ 80 మంది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. రహదారులు, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. ఏడేళ్ల కిందట ఇక్కడ రహదారిని తారురోడ్డుగా మార్చడంతో అక్రమార్కులు కన్ను ఈ ప్రాంతంపై పడింది. ఒక్కోక్కరూ ఎకరా, రెండు ఎకరాల చొప్పున కబ్జాకు పాల్పడ్డారు. ఆక్రమిత స్థలంలో రేకుషెడ్డులు, గొర్రెలు పాకలు, పశువుల శాలలు నిర్మించారు. మరికొందరు జీడి, అరటి, మునగ మొక్కలు నాటి సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి ఆనుకుని తోటలు ఉన్న స్థానికులే ఆక్రమణకు పాల్పడటం గమనార్హం. దీనిపై గ్రామస్థాయి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో 50 ఏకరాల్లో సుమారు 45ఎకరాలు పరాధీనమయ్యాయి.
ఎకరా రూ.50లక్షల పైనే...
ఈ ప్రాంతంలో విద్యుత్‌తోపాటు మౌలిక సుదుపాయాలు కల్పించడంతో ఇక్కడ ఎకరా విలువ ప్రస్తుతం రూ.50లక్షల పైమాటే. ఆ లెక్కన ఆక్రమణకు గురైన సుమారు 45ఎకరాల విలువ సుమారు రూ.23 కోట్ల వరకు ఉంటుందని అంచనా.. లోహరిబంద నుంచి యశోదనగర్ మీదుగా.. ఎల్ కొత్తూరు వరకు తారురోడ్డు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతానికి భారీ డిమాండ్ నెలకొంది. ఇదే ప్రాంతంలో లోహరిబంద హైస్కూల్ ఆట స్థలానికి సుమారు రెండెకరాల స్థలం కేటాయించారు. ఆ స్థలంలోనే జగనన్న కాలనీకి పట్టాలు మంజూరు చేయగా... ఆట స్థలం కావడంతో కొన్ని ఇళ్లు పునాదులతో ఉండగా.. మరికొన్ని నిలిచిపోయాయి. ఈ ఆక్రమణలపై అధికారులు స్పందించి భూములు పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.
చెరువులు కబ్జా...
ఈ గుట్టకు మరోవైపు దిగువ భాగంలో రెండు చిన్న చెరువులు ఉన్నాయి. వేసవిలో పశువులు, మూగజీవాలు దాహార్తి తీర్చుకోవడానికి వందేళ్లకు ముందే గ్రామస్థులు తవ్వించారు. దీంతో ఆక్రమార్కులు వాటిని కూడా విడిచి పెట్టకుండా కంచెలు కట్టి ఆక్రమించారు. జీడి, ఆరటి, మామిడి పంటలు సాగుచేస్తున్నారు. ఇళ్లకు ఆనుకొని సుమారు రెండెకరాల ఆటస్థలం కూడా జగనన్న కాలనీల నిర్మాణాలతో నిరుపయోగంగా మారింది.
చర్యలు తీసుకుంటాం
లోహరిబంద పంచాయతీలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్టు ఎలాంటి ఫిర్యాదులు లేవు. దీనిపై రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. ఆక్రమణలు ఉంటే తొలగించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తాం. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.
- కె.వెంకటేష్, ఆర్డీవో, పలాస