Gold courier missing : బంగారం కొరియర్ అదృశ్యం
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:27 PM
Gold courier mistery నరసన్నపేటకు చెందిన ఓ బంగారం కొరియర్ అదృశ్యమయ్యారు. ఈ నెల 26న కారులో విశాఖపట్నం వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనెల 26న రూ.2కోట్లతో విశాఖపట్నం వెళ్లి తిరిగి రాని వైనం
శ్రీకాకుళం వచ్చే బస్సులో సెల్‌ఫోన్ లభ్యం
పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
నరసన్నపేట, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటకు చెందిన ఓ బంగారం కొరియర్ అదృశ్యమయ్యారు. ఈ నెల 26న కారులో విశాఖపట్నం వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసన్నపేటలోని లచ్చుమన్నపేటకు చెందిన పొట్నూరు గుప్త ఈనెల 26 నుంచి కనిపించడం లేదని సోదరుడు మన్మథరావు ఆదివారం నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొంత కారులో పురుషోత్తనగర్‌కు చెందిన ఒక డ్రైవర్‌ను తీసుకుని గతనెల 26న గుప్త విశాఖపట్నం వెళ్లారు. కారును డ్రైవర్‌తో నరసన్నపేట పంపించేశారు. ఆ రోజు నుంచి ఇంటికి రాలేదు. ఫోన్ చేయగా ఈ నెల 28న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడికి ఆ ఫోన్ లభ్యమైంది. ఆ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం. కానీ, గుప్త అదృశ్యం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఫిర్యాదులో మన్మథరావు పేర్కొన్నారు.
నరసన్నపేటలో కొంతమంది బంగారం వ్యాపారుల అక్రమ వ్యాపారానికి కొరియర్‌గా గుప్త పనిచేస్తున్నారు. బంగారం వ్యాపారం ఇచ్చే నగదును ఎవరికీ అనుమానం రాకుండా తన కారులో తీసుకువెళ్లి.. విశాఖపట్నం, విజయవాడ ఒక్కోసారి తమిళనాడు నుంచి బంగారాన్ని తీసుకువచ్చి స్థానిక వ్యాపారులకు అప్పగిస్తూ ఉంటారు. అందుకు అక్రమంగా బంగారం వ్యాపారం చేసేవారు ఒక ట్రిప్‌నకు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు ఇస్తుంటారు. ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా.. నరసన్నపేటలో కొంతమంది బంగారం వ్యాపారులు ఇలాంటి కొరియర్ల ద్వారా లావాదేవీలు సాగిస్తారు. ఈక్రమంలో ఒక హోల్‌సేల్ బంగారం ముఠా సభ్యులే గత నెల 26న రూ.2కోట్లు ఇచ్చి గుప్తను బంగారం కోసం పంపించినట్లు సమాచారం. పెద్దమొత్తం కారులో డ్రైవర్‌తో వెళ్లిన గుప్త.. తిరిగి కారును డ్రైవర్‌తో వెనక్కి పంపించడం.. సెల్‌ఫోన్ ఆర్టీసీ బస్సులో లభించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుప్త రూ.2కోట్లతో పరారీ అయ్యారా? లేదా కారుడ్రైవర్ పథకం ప్రకారం ఏమైనా చేశారా?.. అసలు ఏమి జరిగిందనేది చర్చనీయాంశమవుతోంది. ఈ సంఘటన విశాఖపట్నం దగ్గర జరిగిందని.. అందుకే విశాఖ పోలీసులే ఈ కేసు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. కాగా గుప్త సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. కాగా సొమ్ముతో గుప్త అదృశ్యమైనట్టు ఫిర్యాదులో పేర్కొనకపోవడం గమనార్హం.