Share News

సెలవులకు వెళ్లి తిరిగి వస్తూ..

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:43 PM

Gurukul student dies in road accident కంచిలిలోని అంబేద్కర్‌ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి మట్టా ప్రణీత్‌(15) ఆదివారం రోడ్డుప్రమా దంలో మృతి చెందాడు.

సెలవులకు వెళ్లి తిరిగి వస్తూ..
ప్రణీత్‌ (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో గురుకుల విద్యార్థి మృతి

కంచిలి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కంచిలిలోని అంబేద్కర్‌ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి మట్టా ప్రణీత్‌(15) ఆదివారం రోడ్డుప్రమా దంలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. క్రిస్మస్‌ సెలవుల నిమిత్తం కొన్ని రోజుల కిందట ప్రణీత్‌ స్వగ్రామమైన సోంపేట మండలం పొత్రఖండ గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఆదివారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకుగాను తండ్రి హేమంతరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జాతీయ రహదారిపై కంచిలి వస్తుండగా జలంత్రకోట జంక్షన్‌ సమీపంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ.. వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రణీత్‌ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి హేమంతరావుకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హేమంతరావు సోంపేట మండలం మామిడిపల్లి గ్రామం వద్ద ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడి మృతి సమాచారం తెలియడంతో తల్లి సరస్వతి రోదించిన తీరు, అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతితో అటు పాఠశాల, ఇటు స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Dec 28 , 2025 | 11:43 PM