cm conference : లక్ష్యాలను చేరుకోవాలి.. ప్రగతి సాధించాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:01 AM
cm conference with collecters లక్ష్యాలను చేరుకుని.. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అమరావతిలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశం
కొన్ని రంగాలకు రాష్ట్రస్థాయిలో ర్యాంకుల కేటాయింపు
శ్రీకాకుళం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): లక్ష్యాలను చేరుకుని.. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అమరావతిలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన సహకారం.. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు.. ప్రగతి సాధించాల్సిన రంగాలపై కలెక్టర్‌తో మాట్లాడి పలు సూచనలు చేశారు. జిల్లా స్థూల ఉత్పత్తి.. లక్ష్యం... ఇంకా సాధించాల్సింది.. ప్రతిభ చూపాల్సిన శాఖలపై నివేదికలను వెల్లడించి పలు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో పలు అంశాలకు సంబంధించి జిల్లాలవారీగా ర్యాంకింగ్‌లను కేటాయించారు. రాష్ట్రంలో జిల్లా పనితీరు ఆధారంగా మొత్తం 62 పాయింట్లు లభించాయి. జిల్లాను ‘బి-గ్రేడ్’గా గుర్తించారు. ఇక జిల్లాకు పరిశ్రమల విభాగంలో 68 పాయింట్లు సాధించి ‘బి గ్రేడ్’, వ్యవసాయ రంగంలో 28 పాయింట్లు సాధించి ‘సి గ్రేడ్’ లభించింది. ‘శ్రీకాకుళం జిల్లా పరిశ్రమలు, చేపల పెంపకం, పశుసంవర్థక రంగాల్లో మంచి పురోగతి సాధించింది. వ్యవసాయంలో ఇంకా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరైన ప్రణాళిక, నిల్వ సదుపాయాలు, సమయానికి గణాంకాలు నమోదు చేయడం ద్వారా ఈ సంవత్సరం లక్ష్యాలను పూర్తిగా చేరుకోవచ్చు’ అని సీఎం సూచించారు.
జిల్లా మొత్తం ఉత్పత్తి (జిల్లా స్థూల ఉత్పత్తి)
ఈ ఏడాది లక్ష్యం : రూ. 49,088 కోట్లు
మొదటి త్రైమాసిక (ఏప్రిల్-జూన్)లో సాధించినది : రూ. 11,880 కోట్లు
సాధించిన శాతం : 24.2 శాతం
మిగిలిన మూడు త్రైమాసికాల్లో సాధించాల్సింది : రూ. 37,208 కోట్లు
వ్యవసాయం.. అనుబంధ రంగాలు..
మొత్తం వ్యవసాయం : రూ. 13,399 కోట్లు
మొదటి త్రైమాసికం సాధన : రూ. 2,354 కోట్లు (17.6 శాతం)
ఇంకా పూర్తిచేయాల్సినది : రూ. 11,045 కోట్లు
పశుసంవర్థక వివరాలు :
పాల ఉత్పత్తి - 2,964 మెట్రిక్ టన్నులు
కోళ్ల సంఖ్య - 24 లక్షలకు పైగా
పశువుల సంఖ్య - సుమారు 2,200
గొర్రెలు, మేకలు - సుమారు 5,700
చేపల పెంపకం...
గతేడాది చేపల విలువ : రూ. 4,347 కోట్లు
ఈ ఏడాది వృద్ధి లక్ష్యం : సుమారు 18 శాతం
ప్రధానంగా రొయ్యలు, సముద్ర చేపలు, చెరువుల్లో చేపల ఉత్పత్తి.
పరిశ్రమలు :
లక్ష్యం : రూ. 8,594 కోట్లు
తొలి త్రైమాసికంలో సాధించినది : రూ. 3,234 కోట్లు (37.6 శాతం)
సేవా రంగం...
లక్ష్యం : రూ. 23,071 కోట్లు
మొదటి త్రైమాసికంలో సాధించింది : రూ. 5,421 కోట్లు (23.5 శాతం)
ప్రధాన సవాళ్లు : పంటల ఉత్పత్తి వివరాలు సమయానికి నమోదు కాకపోవడం. పశువులకు మేత కొరత, చేపల నిల్వ, రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటం.
అవకాశాలు: అరటి, టమాట వంటి తోట పంటలకు అధిక అవకాశాలు కల్పించాలి. రొయ్యలు, సముద్ర చేపల ఉత్పత్తి పెంపకం ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాలు, కోళ్ల ఉత్పత్తి ద్వారా గ్రామీణ ఆదాయం పెంచాలి.
తీసుకోవాల్సిన తక్షణ చర్యలు :
రైతులందరూ పంటల నమోదు పూర్తి చేసి పంట దిగుబడిని నమోదు చేయాలి. టమాట, అరటి పంటలకు నీటి(బిందు సేద్యం) పద్ధతి వినియోగించాలి. పంటలు, చేపలు అధికంగా లభించినప్పుడు నిల్వ లేదా ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గణాంకాలు కచ్చితంగా నమోదు అయ్యేలా జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బృందం ఏర్పాటు చేయాలి.
పశువుల కోసం పచ్చిక దొరికేలా గడ్డి నిల్వ కేంద్రాలు పెట్టాలి. పశువులకు టీకాలు, మెరుగైన జాతుల పెంపకం చర్యలు తీసుకోవాలి. కోళ్ల పెంపకానికి శీతలీకరణ, రవాణా సౌకర్యాలు కల్పించాలి.
పడవలు, వలలు, లోతైన సముద్ర ప్రాంతానికి వెళ్లేందుకు అవసరమైన పరికరాలు సమకూర్చాలి. రొయ్యలు, చేపల కోసం చల్లని నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. చిన్న ప్యాకెట్లు తయారీ సదుపాయాలు కల్పించాలి. రొయ్యల పెంపక కేంద్రాలు పద్ధతిగా నమోదు చేసుకోవాలి.
చిన్నస్థాయి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆహార పదార్థాల ప్రాసెసింగ్, సముద్ర ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలి. గనులు, రాళ్ల తవ్వకం నియంత్రణతో సాగించాలి.
స్థానిక వ్యాపారం, రవాణా, గిడ్డంగులు, హోటళ్లను అభివృద్ధి చేయాలి. గ్రామ, మండల కార్యాలయాలు సమయానికి సమాచారాన్ని నమోదు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సమావేశంలో జిల్లాకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.