మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే కూన
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:19 AM
మున్సిపాలి టీలలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సిద్ధం కావాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, జూన్ 2(ఆంధ్రజ్యోతి): మున్సిపాలి టీలలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సిద్ధం కావాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో మున్సిపాలిటీకి చెందిన 23 వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కమిటీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ సుమారు ఆరు సంవత్సరాలు పాలకవర్గం లేకుండా పట్టణ ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులంతా ఐకమత్యంగా పనిచేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 23 వార్డులలో విజయం సాధించి వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, మొదలవలస రమేష్, బోర గోవిందరావు, సంపతిరావు మురళీధరరావు, బి.వి.రమణమూర్తి, విజయలక్ష్మీబాయి, వెంకట రాజ్యలక్ష్మి, శ్రీదేవి, సునీత, గురయ్య, మురళీ యాదవ్, ఆంజనేయులు, మాలిక్ పాల్గొన్నారు.
ఉపాధి కల్పించడమే ధ్యేయం
బూర్జ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మహిళలకు అన్ని రంగాల్లో స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. పెద్దపేట గ్రామ సచివాలయంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కుట్టుమిషన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా బలబడి... మరికొందరికి ఉపాధి ఇచ్చే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్య క్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.