Share News

మోటార్‌ బాగు చేయడానికి వెళ్లి..

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:14 AM

ఈనెల 9న రాత్రి కోటబొమ్మాళి మండలం పెద్దహరిశ్చంద్రాపురం గ్రామంలోని కాళింగ వీధిలో దుంపల దాలమ్మ(68) అనే వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడు బల్లి రామును హరిశ్చంద్రాపురం బస్టాప్‌ వద్ద శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) శ్రీనివాసరావు తెలిపారు.

 మోటార్‌ బాగు చేయడానికి వెళ్లి..
కేసు పూర్వాపరాలను వివరిస్తున్న ఏఎస్పీ శ్రీనివాసరావు

- వృద్ధురాలి తలపై ఇనుప రాడ్డుతో దాడి

- హత్య కేసులో నిందితుడి అరెస్టు

టెక్కలి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఈనెల 9న రాత్రి కోటబొమ్మాళి మండలం పెద్దహరిశ్చంద్రాపురం గ్రామంలోని కాళింగ వీధిలో దుంపల దాలమ్మ(68) అనే వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడు బల్లి రామును హరిశ్చంద్రాపురం బస్టాప్‌ వద్ద శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఏఎస్పీ కథనం మేరకు... వృద్ధురాలు దాలమ్మ ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటికి సంబంధించిన మోటార్‌ మరమ్మతులకు గురికావడంతో బాగుచేయాలని అదేవీధిలో ఎదురుగా ఉన్న బల్లి రాము అనే యువకుడిని కోరింది. మోటారు బాగుచేయడానికి వెళ్తూ ఆమె మెడలోని విలువైన బంగారు ఆభరణాలను గమనించాడు. ఈనెల 9న రాత్రి 8 గంటల తరువాత దాలమ్మ ఇంట్లోకి రాము వెళ్లాడు. మోటారు బాగుచేస్తానని చెప్పాడు. ఆమె టీ పెడుతున్న సమయంలో వెనుక నుంచి ఇనుప రాడ్డుతో తలపై దాడి చేసి మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడును దొంగిలించి పారిపోయాడు. దీంతో ఆమె మృతిచెందింది. మృతురాలు దాలమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు రామును అరెస్టు చేశామని ఏఎస్పీ తెలిపారు. ఆయన వద్ద నుంచి రెండున్నర తులాల పుస్తెలతాడు, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సత్యనారాయణలు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:14 AM