వైభవం.. తెప్పోత్సవం
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:09 AM
ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామి వారి హంసనావికోత్సవం (తెప్పోత్సవం) ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు.
అరసవల్లి, శ్రీకూర్మంలకు పోటెత్తిన భక్తులు
అరసవల్లి/గార/శ్రీకాకుళం క్రైం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామి వారి హంసనావికోత్సవం (తెప్పోత్సవం) ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఇంద్రపుష్కరిణిలో సూర్యనారాయణ స్వామి వారు విహరించి భక్తులకు కనువిందు చేశారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని కనులారా వీక్షించి తరించారు. అంతకు ముందు స్వామిని ప్రత్యేక పల్లకిలో వేంచేపు చేసి ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ నేతృత్వంలో తిరువీధి నిర్వహించి పుష్కరిలో ఏర్పాటు చేసిన నావికలో ఉంచి విహరింపజేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని స్వామి వారిని దర్శించు కున్నారు. వైజయంతి కళావేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఓం ఆదిత్యాయ, ఓం నమో సూర్యాయనమః అంటూ భక్తులు నినదించారు. డీఎస్పీ సీహెచ్ వివేకా నంద నేతృత్వంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఆలయంలోనూ ప్రత్యేక క్యూలైన్ల వద్ద సిబ్బంది పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.సాయిప్రత్యూ ష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
శ్వేత పుష్కరిణిలో విహరించిన కూర్మనాథుడు..
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథుని ఆల యంలో తెప్పోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. కార్తీకశుద్ధ ద్వాదశి రోజున శ్వేత పుష్కరిణిలో స్వామి వారి నావికోత్సవం అశేష భక్తజనం మధ్య వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో నరసింహ నాయుడు ఆధ్వర్యంలో స్వామిని పల్లకిలో వేంచేపు చేసి పుష్పా లంకరణ చేసి ప్రధాన అర్చకుడు సీతారామ నరసింహాచార్యులు ఇతర అర్చక స్వాములు వేద మంత్రాల మధ్య పుష్కరిణికి తీసుకువచ్చారు. నావికపై వేంచేపు చేసిన స్వామిని పుష్కరిణిలో ఉన్న ఉగ్ర నరసింహ స్వామి వారి విగ్రహం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్యెల్యే గొండు శంకర్ స్వామి వారి పల్లకిని వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పోలీసు బందోబస్తు నడుమ..
కాశీబుగ్గలో జరిగిన సంఘటన నేపథ్యంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, ఆర్డీవో సాయిప్రత్యూష పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, ఆర్మ్‌డ్ పోలీసులు అరసవల్లి, శ్రీకూర్మంలలో ప్రత్యేక బందోబస్తు నిర్వ హించారు. పుష్కరిణి, ఆలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుని ఎటు వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు.
ఏర్పాట్ల పరిశీలన
అరసవల్లి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారి తెప్పోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఆర్డీవో కె.సాయి ప్రత్యూషలతో కలిసి పరిశీలించారు. కాశీబుగ్గ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుం డా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంద్రపుష్కరిణి వద్ద,క్యూలైన్లు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.