Share News

మా డబ్బులు మాకు ఇవ్వండి

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:00 AM

Customers protest in the post office ఇచ్ఛాపురం పోస్టల్‌ కార్యాలయం ఎదుట ఖాతాదారులు మంగళవారం నిరసనకు దిగారు. 33మంది ఖాతాదారుల నుంచి రూ2.80కోట్లు స్వాహా చేశారంటూ ఆందోళన చేపట్టారు. కార్యాలయం గేటుకు తాళం వేసి సిబ్బందిని లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోస్టల్‌ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మా డబ్బులు మాకు ఇవ్వండి
ఖాతాదారులతో మాట్లాడుతున్న పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌

ఇచ్ఛాపురం పోస్టాఫీసు ఎదుట ఖాతాదారుల నిరసన

సిబ్బందిని లోపలకు వెళ్లనీయకుండా కార్యాలయానికి తాళం

15 రోజుల్లో న్యాయం చేస్తామన్న పోస్టల్‌ ఉన్నతాధికారులు

ఇచ్ఛాపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం పోస్టల్‌ కార్యాలయం ఎదుట ఖాతాదారులు మంగళవారం నిరసనకు దిగారు. 33మంది ఖాతాదారుల నుంచి రూ2.80కోట్లు స్వాహా చేశారంటూ ఆందోళన చేపట్టారు. కార్యాలయం గేటుకు తాళం వేసి సిబ్బందిని లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోస్టల్‌ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. బాధితులకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు బి.హైమ మద్దతు తెలిపారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా తమ పిల్లల పేరున పోస్టాఫీస్‌లో కేవీబీ బాండ్లు రూపంలో డబ్బులు దాచుకున్నట్లు బాధితులు తెలిపారు. కానీ, సైబర్‌ నేరగాళ్లతో కలిసి పైసా కూడా లేకుండా ఖాతాలు ఖాళీ చేసేశారని రూ.10లక్షలు కోల్పోయిన చాట్ల తులసీదాస్‌రెడ్డి, రూ.12లక్షలు పోయిన కిరణ్మయి, రూ.20లక్షలు పోగొట్టుకున్న ఇసురు బాలరాజు, రూ.30లక్షలు కోల్పోయిన ఒడిశా నొవగాంకు చెందిన డిల్లమ్మతో పాటు మరికొందరు బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు టెంట్లు వేసుకొని కూర్చొన్నారు. పోస్టుమాస్టర్‌ జి.షణ్ముఖరావు నచ్చజెప్పినా బాధితులు వినకపోవడంతో ఆయన పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బాధితులు వినలేదు. డబ్బులు చెల్లిస్తామని లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే నిరసన విరమించుకుంటామని బాధితులు అనడంతో ‘నేను ఎలా రాసి ఇస్తానని’ ఇన్‌స్పెక్టర్‌ అన్నారు. వెంటనే ఆయన పోస్టల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజు, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టల్‌ అధికారి హరిబాబుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తామని, ఒక్క పైసా కూడా పోదని ఏడీ ఫోన్‌ ద్వారా వాయిస్‌ మెసేజ్‌ పంపించారు. అలాగే, జనసేన ఇన్‌చార్జి రాజుతో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. 15రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో బాధితులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. తమకు న్యాయం జరగకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలిపారు.

Updated Date - Oct 22 , 2025 | 12:00 AM