Share News

నీరివ్వరూ!

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:36 PM

Drinking water problems in Ichchapuram Municipality ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా తాగునీటికి కటకటలాడుతున్నారు. 23 వార్డులు ఉన్న మునిసిపాలిటీలో 15 ఏళ్ల కిందట తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 28 వేల మంది జనాభాకు తగ్గట్టుగా వీటిని వేశారు. ఇప్పుడు పట్టణంతోపాటు జనాభా కూడా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 36వేల మంది జనాభా అని చెబుతున్నా.. ఆ సంఖ్య 50 వేలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. కానీ జనాల అవసరాలకు తగ్గట్టుగా తాగునీటి సరఫరా లేదు.

నీరివ్వరూ!
ఏఎస్‌పేట (బోర్డర్‌)లో తాగునీటి కోసం మహిళల ఇక్కట్లు

  • ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో తాగునీటి కష్టాలు

  • 1,2,3 వార్డుల్లో రెండు రోజులకోసారి ట్యాంకర్‌తో సరఫరా

  • సమస్య పరిష్కరించాలని ప్రజల విజ్ఞప్తి

  • ఇచ్ఛాపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా తాగునీటికి కటకటలాడుతున్నారు. 23 వార్డులు ఉన్న మునిసిపాలిటీలో 15 ఏళ్ల కిందట తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 28 వేల మంది జనాభాకు తగ్గట్టుగా వీటిని వేశారు. ఇప్పుడు పట్టణంతోపాటు జనాభా కూడా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 36వేల మంది జనాభా అని చెబుతున్నా.. ఆ సంఖ్య 50 వేలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. కానీ జనాల అవసరాలకు తగ్గట్టుగా తాగునీటి సరఫరా లేదు. పట్టణ జనాభాకు రోజుకు సగటున 5.10 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం అందులో సగం నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మునిసిపాలిటీలోని 1, 2, 3 వార్డుల్లో ఏడాది పొడవునా తాగునీటి కష్టాలే. ఈ వార్డుల పరిధిలోని పురుషోత్తపురం, ఏఎస్‌పేటకు ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకులయ్యాయి. పురుషోత్తపురం పుష్పగిరి కొండపై 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకర్‌ను నిర్మించి వృథాగా వదిలేశారు. అది శిథిలావస్థకు చేరింది. దీంతో ఈ మూడు వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని అందిస్తున్నారు. రత్తకన్న పరిధిలో చాలా వీధులకు రెండు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. పలు ప్రాంతాల్లో భూ మట్టానికి మూడు నుంచి ఐదు అడుగుల గోతులో ఉన్న కుళాయి నుంచి నీటిని పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 బోర్లు పనిచేయడం లేదని అధికారికవర్గాలు చెబుతున్నాయి. కానీ, అంతకు మించి బోర్లు మూలకు చేరాయని తెలుస్తోంది.

  • ఉద్దానం.. అధ్వానం

  • ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంలో ఇచ్ఛాపురం మునిసిపాలిటీకి చోటిచ్చారు. కానీ..ఇంతవరకూ నీటిని అందించలేదు. రూ.54.48 కోట్ల కేంద్ర నిధులతో పైలెట్‌ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. అది పూర్తయితే కానీ.. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం లేదు. ఉద్దానం ప్రాజెక్టులో భాగంగా బాహుదా నదిలో ఊటబావులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. క్లోరినేషన్‌ చేపట్టిన తరువాత రాజావారితోటలో రిజర్వాయర్‌ ద్వారా పట్టణ అవసరాల కోసం 8లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజూ విడిచిపెడుతున్నారు. ఈ నీరు ప్రజల అవసరాలకు చాలడం లేదు. బాహుదాలో పుష్కలంగా నీరు ఉన్నా అధికారులు రెండు రోజులకోసారి కుళాయిల ద్వారా తాగునీటిని అందిస్తున్నారని పట్టణ వాసులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

  • చర్యలు తీసుకుంటున్నాం

    1, 2, 3 వార్డులు పురుషోత్తపురం, ఏఎస్‌పేటల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సుడా అధికారులతో కూడా మాట్లాడాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పీల గోవింద్‌ వద్ద కూడా ప్రతిపాదనలు పెట్టాం. వీలైనంత త్వరలో పనులు ప్రారంభిస్తాం.

    - బెందాళం అశోక్‌, ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం

  • సమస్య పరిష్కరించాలి

    ఇచ్ఛాపురంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ఉంది. ఎప్పుడో దశాబ్ద కాలం కిందట వేసిన పైపులైన్లు, కుళాయిలు పాడయ్యాయి. ఎప్పడు నీటి సరఫరా ఉంటుందో? ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

    - కాళ్ల నరసింహమూర్తి, ఇచ్ఛాపురం

  • మౌలిక వసతులు లేవు

    మునిసిపాలిటీలో మౌలిక వసతులు లేవు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పటికైనా పాలకులు దృష్టి సారించాలి.

    - కొరికాన యోగి, ఇచ్ఛాపురం

  • ట్యాంకర్ల ద్వారా సరఫరా

    మునిసిపాలిటీలో తాగునీటి ఎద్దడి నిజమే. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. త్వరలో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంతో పాటు కేంద్ర నిధులతో చేపడుతున్న ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. అంతవరకూ ఇబ్బందులు తప్పవు.

    - ఎన్‌.రమేష్‌, కమిషనర్‌, ఇచ్ఛాపురం మునిసిపాలిటీ

Updated Date - Dec 08 , 2025 | 11:36 PM