వందేమాతరం గొప్పతనం భావితరాలకు తెలియాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:51 PM
greatness of Vande Mataram వందేమాతరం గీతం గొప్పతనం భావితరాలకు తెలియజేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మన జాతీయ గీతం ‘వందేమాతరం’ 150 సంవత్సరాల సంస్మరణోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సామూహిక గాన కార్యక్రమం నిర్వహించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): వందేమాతరం గీతం గొప్పతనం భావితరాలకు తెలియజేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మన జాతీయ గీతం ‘వందేమాతరం’ 150 సంవత్సరాల సంస్మరణోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సామూహిక గాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘1875లో బంకించంద్ర ఛటర్జీ బెంగాళీలో రచించిన వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్యోద్యమంలో చాలా ప్రాచుర్యం పొందింది. 1950వ సంవత్సరంలో దీనిని జాతీయగీతంగా స్వీకరించారు. ప్రజల్లో గొప్ప ప్రేరణ నింపిన ఈ గీతం యొక్క ప్రాధాన్యం భావితరాలకు చాటిచెప్పాల’ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఇన్‌చార్జి డీఆర్వో లక్ష్మణమూర్తి, బీసీ వెల్ఫేర్ అధికారి అనూరాధ, విశ్రాంత డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ జీఏ సూర్యనారాయణ, విభాగాల పర్యవేక్షకులు సురేష్, రాజేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
మహేంద్రతనయ రిజర్వాయర్‌ను పూర్తిచేయాలి
మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రాజెక్టు పురోగతిపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెళియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం తదితర మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులకు ప్రధాన అడ్డంకిగా భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. భూసేకరణ, ఇతర పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు దాదాపు రూ.16.20కోట్లు విడుదల చేయడానికి భూ సేకరణ విభాగం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. పునరావాసం, పునర్నిర్మాణ ప్యాకేజీల కోసం అదనంగా రూ.24.50కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. ఈ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. పలాస-పర్లాకిమిడి డైవర్షన్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ దాదాపు పూర్తయ్యిందని, అర్హులకు చెల్లింపులను వేగవంతం చేయాలన్నారు. ఇతర పనులు, సమస్యలకు సంబంధించిన నివేదికలను టెక్కలి ఆర్డీవో, తహశీల్దార్లు త్వరగా సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని, రైతులకు సాగునీరు, పలాస-కాశీబుగ్గ పట్టణానికి తాగునీరు సకాలంలో అందేలా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ ఎస్.వెంకటేష్, ఇన్‌చార్జి డీఆర్వో లక్ష్మణమూర్తి, ఉప కలెక్టర్ జయదేవి, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, వంశధార ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.