School funds: బడిబాగుకు నిధులొచ్చాయ్!
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:15 AM
school devolpment works వైసీపీ పాలనలో గాడితప్పిన ప్రభుత్వ విద్యను పట్టాలెక్కించేందుకు కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. సమస్యలు పరిష్కరిస్తూనే, పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తోంది.
తొలివిడతగా జిల్లాకు రూ.3.08 కోట్లు
హిరమండలం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో గాడితప్పిన ప్రభుత్వ విద్యను పట్టాలెక్కించేందుకు కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. సమస్యలు పరిష్కరిస్తూనే, పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తోంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, ఇతర సామగ్రిని అందించింది. తాజాగా పాఠశాలల నిర్వహణకు సంబంధించి తొలివిడతగా జిల్లాకు రూ.3.08కోట్లు విడుదల చేసింది. జిల్లాలో 2,226 ప్రభుత్వ ప్రాథమిక, 427 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు రూ.1.88 కోట్లు, ఉన్నత పాఠశాలలకు రూ.1.20 కోట్లు చొప్పున నిర్వహణ నిధులు జమయ్యాయి. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు ఇలా నిధులు జమ చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఒకటి నుంచి 30 మంది ఉంటే రూ.10వేలు, 31 నుంచి 100 మందికి రూ.25వేలు, 101 నుంచి 250 మందికి రూ.50వేలు, 251 నుంచి వెయ్యి మంది వరకు రూ.75వేలు ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే రూ.లక్ష వరకు నిర్వహణ నిధులు కేటాయిస్తారు.
తీరనున్న అవస్థలు
గత ప్రభుత్వం పాఠశాల నిర్వహణ నిధులు విడుదల చేయకపోగా, ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లోని డబ్బును సైతం వెనక్కి తీసుకుంది. ఏ చిన్న పనికైనా ప్రధానోపాధ్యాయులు సొంత నగదు ఖర్చు చేసేవారు. ‘నాడు-నేడు’ పథకం కింద నిర్మించిన భవనాలు అసంపూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం నిర్వహణ నిధులు జమకావడంతో పాఠశాలల్లో ఇబ్బందులు తీరుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కిటికీలు, తలుపులు, విద్యుత్ మరమ్మతులకు వీటిని ఉపాధ్యాయులు ఉపయోగించనున్నారని హిరమండలం ఎంఈవో కె.రాంబాబు తెలిపారు. సుద్దముక్కలు, బ్లాక్‌బోర్డులు, డస్టర్లు తదితర వాటిని కొనుగోలు చేయనున్నారని వెల్లడించారు.
మండల విద్యాశాఖ కార్యాలయాలకు..
మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహణ కోసం నిధులు కేటాయించారు. జిల్లాలో 30 ఎమ్మార్సీలు ఉన్నాయి. ఒక్కో దానికి రూ.70వేలు కేటాయించారు. సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కార్యాలయ నిర్వహణ ఖర్చులు కింద రూ.20వేలు, టీఎల్‌ఎం గ్రాంటు రూ.15వేలు, ఇతర ఖర్చులకు రూ.20వేలు, సమావేశాలు, రవాణా చార్జీల కింద రూ.15వేలు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల కోసం రూ.28,700 చొప్పున నిధులు కేటాయించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.