Share News

Rtc service free: వచ్చేస్తోంది ‘స్త్రీ శక్తి’

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:51 PM

free bus service కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్ర్తీ శక్తి పథకం అమలుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి ఈ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనుంది.

Rtc service free: వచ్చేస్తోంది ‘స్త్రీ శక్తి’

  • ఐదు ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

  • స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి అమలు

  • ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల

  • ఆకతాయిలతో ఇబ్బంది లేకుండా కండక్టర్లకు బాడీవార్న్‌ కెమెరాలు

  • శ్రీకాకుళం/కాశీబుగ్గ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్ర్తీ శక్తి పథకం అమలుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి ఈ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. బస్సుల్లో రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పటిష్ట భద్రత ఉండేలా కండక్టర్లకు బాడీవార్న్‌ కెమెరాలను కూడా ప్రభుత్వం సమకూర్చింది. జిల్లావ్యాప్తంగా శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, టెక్కలి, పలాస డిపోల్లో 310 బస్సులు ఉన్నాయి. ఇందులో 250 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించారు. త్వరలో మరో యాభై విద్యుత్‌ బస్సులు జిల్లాకు రానున్నాయి. జిల్లాలో అత్యధికంగా ఇచ్ఛాపురం నుంచి విశాఖ వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే సోంపేట, పలాస, పాతపట్నం, కొత్తూరు, ఆమదాలవలస, టెక్కలి, నరసన్నపేట మార్గాల్లో కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు అన్ని పట్టణాల మీదుగా విశాఖకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు జిల్లాలో అంతర్గతంగా ప్రయాణించే మహిళలకు ప్రయోజనం దక్కనుంది. మహిళల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు.. విద్యార్థినులు, చిరుద్యోగులు, మహిళా కూలీలు.. ఇలా అందరికీ ఉచిత బస్సు ప్రయాణం వర్తించనుంది. జిల్లాలో సుమారు రోజుకు 20వేల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.

  • ఐదు సర్వీసుల్లో వెసులుబాటు..

  • సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సు మొత్తం ఐదు ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణం చేసే మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు.. ఇలా ఎవరైనా ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌కార్డు.. ఇలా తదితర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కండక్టర్లకు చూపించాలి. ప్రయాణ సమయంలో మహిళలకు ఆర్టీసీ కండక్టర్లు జీరో టికెట్‌ ఇస్తారు. ఇందుకు అయ్యే ఖర్చు ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. అలాగే విద్యార్థినులకు ఇక బస్‌పాస్‌లు రెన్యువల్‌ లేకుండా వీలు కలుగుతుంది. ఉచిత ప్రయాణం కారణంగా ఒక్కసారిగా బస్సుల్లో రద్దీ పెరగనుంది. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బస్సుల్లో భద్రత దృష్ట్యా, ఆకతాయిల నుంచి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు కండక్లర్లకు బాడీవార్న్‌ కెమెరాలు ప్రభుత్వం అందజేయనుంది.

  • ఈ బస్సుల్లో వర్తించదు..

  • మహిళలకు కొన్ని బస్సుల్లో ప్రయాణం వర్తించదు. నాన్‌స్టాప్‌ సర్వీసులు, ఇంటర్‌ స్టేట్‌బస్సులు, కాంట్రాక్ట్‌ క్యారేజీ, చార్టర్డ్‌, ప్యాకేజీ టూర్లు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, అలా్ట్ర డీలక్స్‌ సూపర్‌ లగ్జరీ, స్టార్‌ లైనర్‌ తోపాటు అన్ని ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుపడదు.

  • ఉపశమనం..

  • మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత రవాణా చాలా మేలు చేస్తుంది. ఎక్కడికి వెళ్లాలన్నా రవాణా చార్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

    - బదాడ భారతి, కాశీబుగ్గ

    ...................

  • రుణపడి ఉంటాం..

  • ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. మాలాంటి వారి జీవనోపాధికి ఇది మంచి నిర్ణయం. ప్రభుత్వానికి మహిళలు రుణపడి ఉంటారు.

    - సవర కళావతి, పెంటిభద్ర, కాశీబుగ్గ

    ...................

  • ప్రభుత్వానికి కృతజ్ఞతలు

  • ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేయనున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం హర్షనీయం.

    - కె.భాను, పలాస

    ...................

  • ఏర్పాట్లు చేస్తున్నాం

  • జిల్లాలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చింది. మరోవైపు సిబ్బందికి డెమో శిక్షణ కూడా ఇస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు పక్కాగా అమలు చేస్తాం.

    - హనుమంతు అమరసింహుడు, ఇన్‌చార్జి ప్రజా రవాణా అధికారి, శ్రీకాకుళం

Updated Date - Aug 13 , 2025 | 11:51 PM