Share News

గిరిజన మహిళలకు శుభవార్త

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:14 AM

Free gas connections గిరిజన మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. దీంతో గిరిజన మహిళలందరికీ లబ్ధి చేకూరనుంది.

గిరిజన మహిళలకు శుభవార్త

దీపం పథకం-2 కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు

త్వరలో మంజూరుకు సన్నాహాలు

జిల్లాలో 5వేల మందికి లబ్ధి చేకూరే అవకాశం

మెళియాపుట్టి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి):

మెళియాపుట్టి మండలం బంజీరు గ్రామానికి చెందిన జన్ని అక్కమ్మ కుటుంబంలో ఇద్దరే ఉంటున్నారు. ఇప్పటికీ గ్యాస్‌ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేక కట్టెలపొయ్యిని వినియోగిస్తున్నారు.

మెళియాపుట్టి మండలం నేలబొంతు గ్రామానికి చెందిన సుందరమ్మకు ఏ ఆధారం లేదు. ప్రభుత్వ పింఛన్‌తోనే బతుకుతోంది. పొగ కారణంగా కళ్లు సరిగా కనిపించకపోయినా.. కట్టెలపొయ్యినే వినియోగిస్తోంది. గ్యాస్‌ కొనేంత డబ్బులు తమ దగ్గర లేవని వాపోతోంది.

ఇటువంటి గిరిజన మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. దీంతో గిరిజన మహిళలందరికీ లబ్ధి చేకూరనుంది. ఎన్నికల హామీల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం కింద ఇప్పటికే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లును అందజేస్తోంది. గతేడాది ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో నవంబరు 1న సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 6,92,825 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికి రెండు విడతల్లో లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లు అందాయి. ప్రస్తుతం మూడో విడత అమలవుతోంది. తాజాగా గిరిజన మహిళలకు దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరుకు చర్యలు చేపడుతోంది. జిల్లాలోని 16 మండలాల్లో 672 గిరిజన గ్రామాలు ఉన్నాయి. 93,877మంది గిరిజనులు నివసిస్తున్నారు. గ్యాస్‌ కొనుగోలు ఆర్థికభారం కావడంతో ఇప్పటికీ చాలామంది కట్టెల పొయ్యినే వినియోగిస్తున్నారు. రహదారులు లేక కొంతమంది గ్యాస్‌ కనెక్షన్లు తీసుకోలేదు. సుమారు 30వేల కుటుంబాలు కట్టెలపొయ్యిపైనే వంట చేస్తున్నట్టు సమాచారం. ఇటువంటి వారికి ఉచిత గ్యా్‌ కనెక్షన్లు ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 23,912 కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జిల్లాలో సుమారు 5వేల కనెక్షన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మెళియాపుట్టి ఎంపీడీవో ప్రసాద్‌ పండా వద్ద ప్రస్తావించగా.. ‘ఇప్పటికే ప్రతీ ఇంటికి వెళ్లి ఎంతమంది గ్యాస్‌ వినియోగిస్తున్నారో సర్వే చేశాం. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇంకా ఆదేశాలు రాలేదు’ అని తెలిపారు.

Updated Date - Sep 07 , 2025 | 12:14 AM