Free bus service : మహిళలకు వరం.. స్త్రీ శక్తి
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:57 AM
Free bus travel for womens రాష్ట్రంలో మహిళలకు మరో సంక్షేమ బహుమతిగా.. ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు స్త్రీ శక్తి పథకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు.
మంత్రి అచ్చెన్నాయుడు
జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం
శ్రీకాకుళం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలకు మరో సంక్షేమ బహుమతిగా.. ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు స్త్రీ శక్తి పథకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం మండలం సింగుపురంలో ఈ పథకాన్ని ప్రారంభించి.. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో ఆయన ప్రయాణించారు. మహిళలతో మాట్లాడారు. వారికి జీరో ఫేర్ టిక్కెట్లను అందజేశారు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘స్ర్తీ శక్తి పథకం మహిళలకు వరం. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఐదు రకాల బస్సుల్లో.. (పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ) మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాం. మహిళల గౌరవం, ఆర్థిక సాధికారిత పెంపు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసి మహిళల సాధికారతకు పునాది ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుంది. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. 90 శాతం హామీలు నెరవేర్చామ’ని తెలిపారు.
ఆర్టీసీ బలోపేతానికి చర్యలు..
ఆర్టీసీ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు. ‘స్త్రీశక్తి పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా 8,450 బస్సులను సిద్ధం చేశాం. సంవత్సరానికి సుమారు రూ.2వేల కోట్లు వ్యయం కానుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంపు, ఆర్టీసీ ఖాళీ స్థలాలను వినియోగించి ఆదాయ మార్గాలు పెంచే చర్యలు చేపడతామ’ని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలు గొండు శంకరరావు, బగ్గు రమణమూర్తి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయకలెక్టర్ డి.పృథ్వీరాజ్, ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బ్రహ్మానందరెడ్డి, ఆర్డీఓ సాయిప్రత్యూష, ఆర్టీసీ డీసీలు ఎల్.ఎస్.నాయుడు, ఏడీసీ మురళీధర్, పీవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.