Share News

సన్నబియ్యం పేరిట మోసం

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:58 PM

Ration rice is repolished and looted జిల్లాఅంతటా సన్నబియ్యం పేరిట దందా కొనసాగుతోంది. చాలామంది వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి, బ్రాండెడ్‌ ఖాళీ సంచుల్లో ప్యాకింగ్‌ చేసి సన్నబియ్యం పేరిట అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రజలను మోసగిస్తున్నారు.

సన్నబియ్యం పేరిట మోసం

రేషన్‌ బియ్యాన్ని రీపాలిష్‌ చేసి దోపిడీ

బ్రాండెడ్‌ సంచుల్లో నింపి.. అధిక ధరకు విక్రయం

ఆపై తూకంలోనూ బస్తాకు 2 కిలోల వరకు తరుగు

రణస్థలం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రణస్థలంలో ఇటీవల సన్నబియ్యం, బ్రాండెడ్‌ బియ్యం 25 కిలోల బస్తాను రూ.1000కి చొప్పున అందిస్తామని ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో చాలామంది కొనుగోలు చేశారు. శాంపిళ్లలో సన్నబియ్యాన్ని చూపించి.. తీరా బస్తాల్లో ముతక బియ్యాన్ని అందించి మోసం చేశారు. చివరకు ఓ హోటల్‌ యాజమానికి అందించే క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు దొరికిపోవడంతో స్థానికులు నిలదీశారు. సన్నబియ్యం పేరిట వసూలు చేసిన మొత్తాన్ని ఇవ్వడంతో వారిని విడిచిపెట్టారు.

..ఇలా జిల్లాఅంతటా సన్నబియ్యం పేరిట దందా కొనసాగుతోంది. చాలామంది వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి, బ్రాండెడ్‌ ఖాళీ సంచుల్లో ప్యాకింగ్‌ చేసి సన్నబియ్యం పేరిట అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రజలను మోసగిస్తున్నారు. జిల్లాలో 10లక్షల కుటుంబాలు సన్నబియ్యం వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నెలకు సగటున 12లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. పేదలకు ప్రభుత్వం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్‌ బియ్యం అందిస్తోంది. కానీ ఆ బియ్యాన్ని తింటోంది కేవలం 10 శాతం మాత్రమే. వ్యవసాయ భూములు లేనివారు, నిరుపేదలు ఎక్కువగా రేషన్‌ బియ్యం తింటున్నారు. మిగతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు మాత్రం రేషన్‌ బియ్యాన్ని వినియోగించడం లేదు. సన్నబియ్యాన్ని మార్కెట్‌లో కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. కాగా కొందరు వ్యాపారులు సన్నబియ్యం పేరిట ముదక బియ్యాన్ని అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. 25 కిలోల రేషన్‌ బియ్యం సుమారు రూ.500 చొప్పున కార్డుదారుల వద్ద కొనుగోలు చేసి.. వాటిని రీపాలిష్‌ చేస్తున్నారు. స్టీమ్‌లైజ్‌ యంత్రాలతో సన్నబియ్యంగా మార్చేసి.. పేరుమోసిన బ్రాండెడ్‌ బ్యాగుల్లో వాటిని నింపేసి 25 కేజీల బస్తా రూ.వెయ్యికి పైగా విక్రయిస్తూ లాభపడుతున్నారు.

నిబంధనలు బేఖాతరు!

సీసీలు, మసూరీల పేరుతో జిల్లాలో ఎక్కువగా బియ్యం విక్రయిస్తుంటారు. సాధారణంగా పాత ధాన్యానికి సంబంధించి మిల్లు చేసిన బియ్యం ఎంతో బాగుంటాయి. తినేందుకు సౌకర్యంగా ఉంటాయి. కానీ జిల్లాలో అది జరగడం లేదు. రేషన్‌ బియ్యాన్ని రీ పాలిష్‌ చేసి వాటినే ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల్లా రైస్‌స్టోర్లు సైతం వెలుస్తున్నాయి. రైస్‌ డిపోల ఏర్పాటుకు ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ కింద తప్పనిసరిగా తూనికలు, కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. బియ్యం సంచులపై బ్రాండ్‌ పేరు, ఎన్ని కిలోలు, ఎమ్మార్పీ, తయారీ సంస్థ, చిరునామా, ప్యాకింగ్‌ తేదీ, ఫోన్‌ నంబరు తప్పనిసరిగా ముద్రించాలి. బియ్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం పన్ను విధించిన నేపథ్యంలో తప్పనిసరిగా జీఎస్టీ లైసెన్స్‌ తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలేవీ జిల్లాలో కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో రైస్‌డిపోలు ఉండగా.. ఇలా అనుమతులు పొందినవి ఒకటి రెండు మాత్రమే.

లాభసాటి వ్యాపారంగా..

జిల్లాలో మిల్లర్లు, వ్యాపారులకు ఇదో లాభసాటి వ్యాపారంగా మారింది. జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు చేరుతాయి. మిల్లర్లు వాటిని మర ఆడించి పౌరసరఫరాల శాఖకు బియ్యం అందించాలి. అయితే ఏడాదిలో ఒకటి రెండుసార్లు మాత్రమే ధాన్యం మర ఆడించి బియ్యం అందిస్తున్నారు. మిగతావి మాత్రం పదేపదే రీ పాలిష్‌ చేసి అందించినవే. కొందరు మిల్లర్లు వీటినే సన్నబియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌కు అందిస్తున్నారు. మరికొందరు మిల్లు ఆడించి వాటినే బ్రాండెండ్‌ సంచుల్లో నింపి విక్రయిస్తున్నారు. అయితే వీటి ఆహార నాణ్యత చాలా తక్కువ. హైబ్రిడ్‌ ధాన్యాన్ని బీపీటీ బియ్యంగా మార్చి విక్రయిస్తున్న వారు ఉన్నారు. తూకంలోనూ 25 కిలోల దగ్గర.. అర కిలో నుంచి 2 కిలోల వరకూ మోసం చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖతోపాటు తూనికలు, కొలతల శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.

ఇలా గుర్తించవచ్చు

నాణ్యత తక్కువగా ఉన్న బియ్యం పాతవే అయినప్పటికీ వండితే మాత్రం అన్నం ముద్దగా మారిపోతుంది. మెతుకు ఒకవైపు పగులుగా మారి.. వండిన కొన్ని గంటలకే చెడిపోతుంది. స్టీమ్‌ బియ్యం అయితే వండిన తరువాత ఎనిమిది గంటలు దాటితే అన్నం అడుగు భాగంలో పదును ప్రారంభం అవుతుంది. కొత్త బియ్యాన్ని పాత బియ్యంగా మారిస్తే ఎదుగుదల తక్కువగా ఉంటుంది.

Updated Date - Nov 23 , 2025 | 11:58 PM