ధాన్యం తూకాల్లో మోసం
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:15 AM
The Millers' Fraud at Weybridge రైతులు పండించే ధాన్యాన్ని ఏదో ఒకరకంగా మిల్లర్లు దోచుకుంటూనే ఉన్నారు. కొన్నాళ్ల కిందట 80 కేజీల ధాన్యం బస్తాకు తేమశాతం పేరిట రెండేసి కేజీలు చొప్పున అదనంగా తీసుకున్నారు. దీనిపై రైతుల్లో వ్యతిరేకత రావడం.. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో మిల్లర్లు కొత్త దందాకు తెరలేపారు. కంప్యూటర్ కాటాల్లో కిరికిరికి పాల్పడుతున్నారు.
ట్రాక్టర్ లోడ్‌కు 80 నుంచి 100 కేజీల వరకు దోపిడీ
వేబ్రిడ్జిల వద్ద మిల్లర్ల చేతివాటం
నరసన్నపేట, డిసెంబరు 15(ఆంధజ్యోతి):
గత నెల 22న నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన వెలమల దాలమ్మ.. తాను పండించిన ధాన్యాన్ని జమ్ము జంక్షన్‌లోని ఒక రైస్‌మిల్లుకు ట్రాక్టర్‌పై తరలించారు. ధాన్యం అన్‌లోడ్ చేసిన తర్వాత ట్రాక్టర్ బరువు 3,670 కేజీలు ఉన్నట్టు కంప్యూటర్ కాటాలో చూపించారు.
దాలమ్మ కుమారుడు అదే ట్రాక్టర్‌పై అదే మిల్లుకు ఈ నెల 1న కొన్ని ధాన్యం బస్తాలను తరలించారు. అన్‌లోడింగ్ తర్వాత ట్రాక్టర్ బరువు 3,675 కేజీలు ఉన్నట్టు చూపించారు. అయితే పెద్దగా తేడా లేదు.
మళ్లీ అదే రైతు అదే ట్రాక్టర్‌లో ఈ నెల 8న 38 బస్తాల ధాన్యం మిల్లుకు పంపించారు. ఈ సారి ట్రాక్టర్ బరువు 3,755 కేజీలు ఉన్నట్టు మిల్లర్లు నమోదు చేశారు. అంటే గతంలో రెండుసార్లు కన్నా అన్‌లోడింగ్ తర్వాత ట్రాక్టరు బరువు 85 కేజీలు ఎక్కువ చూపి.. ఆ రైతును మోసగించారు.
టి.అప్పారావు అనే కౌలు రైతు నరసన్నపేటలో ఒక మిల్లుకు ధాన్యం తరలించారు. అక్కడ వే బ్రిడ్జిలో ట్రక్కుకు తూకం వేశారు. తర్వాత అనుమానం వచ్చి మరో వే బ్రిడ్జి వద్ద మళ్లీ తూకం వేయగా.. అక్కడ కన్నా ట్రక్కుకు 240 కేజీల బరువు తక్కువ ఉంది. దీంతో రైతు మిల్లర్‌ను ప్రశ్నించగా.. సాంకేతిక పొరపాటు జరిగిందని సర్ది చెప్పారు.
..ఇలా రైతులు పండించే ధాన్యాన్ని ఏదో ఒకరకంగా మిల్లర్లు దోచుకుంటూనే ఉన్నారు. కొన్నాళ్ల కిందట 80 కేజీల ధాన్యం బస్తాకు తేమశాతం పేరిట రెండేసి కేజీలు చొప్పున అదనంగా తీసుకున్నారు. దీనిపై రైతుల్లో వ్యతిరేకత రావడం.. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో మిల్లర్లు కొత్త దందాకు తెరలేపారు. కంప్యూటర్ కాటాల్లో కిరికిరికి పాల్పడుతున్నారు. రైతుల నుంచి ఒక్కో ట్రాక్టర్‌లోడుకు 80 కేజీల నుంచి 100 కేజీల వరకు ధాన్యాన్ని దోచుకుంటున్నారు. నరసన్నపేట, టెక్కలి, కోటబొమ్మాళి, పోలాకి, కాశీబుగ్గ తదితర ప్రాంతాల్లో ఈ దందా సాగుతోంది. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వేబ్రిడ్జిపై తూకం వేసిన సమయంలో ఫొటోలు తీసి.. వేబిల్లుపై ముద్రిస్తారు. ఆ బిల్లును రైతులకు ఇవ్వాలి. అన్‌లోడింగ్ సమయంలో ట్రక్కు తూకం వేస్తారు. అన్‌లోడింగ్ తర్వాత మరో బిల్లు ఇవ్వాలి. కానీ ఒకసారి మాత్రమే బిల్లు ఇస్తున్నారు. ట్రక్కు తూకం వేసిన సందర్భంలో డ్రైవర్ దిగకుండానే కంప్యూటర్ కాటాలో లాక్ చేస్తున్నారు. వే బ్రిడ్జ్ మీద ట్రక్కు నుంచి డ్రైవర్ బయటకు వచ్చిన తరువాత కూడా డ్రైవర్ బరువుతో కలిపి ట్రక్కు బరువు కంప్యూటర్‌లో చూపిస్తోంది. ఇలా రైతులు కళ్లు కప్పి ఒక్కో ట్రక్కుకు 80 కేజీలకుపైగా ధాన్యాన్ని మిల్లర్లు దోచేస్తున్నారు.
ముందస్తు ప్రణాళికతోనే..
జిల్లాలో 267 రైస్ మిల్లులు ఉండగా.. వీటిలో సుమారు 70 మిల్లులకు చెందిన యాజమానులకే కంప్యూటర్ వే బ్రిడ్జిలు ఉన్నాయి. ఏ మిల్లుకు రైతు ధాన్యం పంపిస్తాడో.. ఆ మిల్లుకు చెందిన వే బ్రిడ్జిపై తూకం వేస్తేనే ఆన్‌లోడింగ్ చేస్తారు. లేదంటే కొర్రీలు పెట్టి.. అన్‌లోడింగ్‌లో జాప్యం చేస్తారు. సాధారణంగా రైతులు కంప్యూటర్ కాటాలో బరువు తెలుసుకునేందుకు ట్రక్కుతో ఽధాన్యం తీసుకువెళ్లతారు. తూకం వేసే వారు ఏ మిల్లుకు ఈ ధాన్యం లోడింగ్ చేస్తారో అడిగి తెలుసుకుంటారు. తన ఓనర్‌కు చెందిన మిల్లుకు ధాన్యమైతే దాదాపు 80 కేజీల నుంచి 120 కేజీలు వరకు ధాన్యం దోచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. లోడింగ్ సమయంలో కొంత బరువు తక్కువగాను.. అన్‌లోడింగ్ చేసిన తరువాత ట్రక్కు బరువు ఎక్కువగా ఉన్నట్లు సర్దుబాటు చేస్తారు. వేరొక మిల్లుకు అయితే సుమారు ఇదే తంతుతో 50కేజీల వరకు దోచుకుంటున్నారు. మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన తూనికలు కొలతలు శాఖ అధికారులు.. వేబ్రిడ్జిలో తూకాలపై పట్టించుకునే సందర్భాలు చాలా తక్కువని రైతులు ఆరోపిస్తున్నారు. కంప్యూటర్ కాటాల పనితీరు తెలుసుకునే సాంకేతిక సిబ్బంది కూడా జిల్లాలో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మిల్లర్ల మోసాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
రైతులు ధాన్యంను మిల్లులకు పంపించే సమయంలో రెండు మూడు వే బ్రిడ్జిల వద్ద తూకాలు వేసి రసీదులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఖాళీ ట్రక్కు బరువును లోడింగ్‌కు ముందు.. అన్‌లోడింగ్ తరువాత తూకం వేయించాలి. తూకం సమయంలో అప్రమత్తంగా ఉంటూ.. వేబ్రిడ్జిల వద్ద లాకింగ్ చేయకుండా, కంప్యూటర్ కాటాను పరిశీలించాలి.
చర్యలు తీసుకుంటాం
ధాన్యం తూకాల్లో మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ధాన్యం తూకం సమయంలో మోసాలకు గురైన రైతులు వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి.
- చిన్నమ్మి, తూనికలు- కొలతలు శాఖ అధికారి, శ్రీకాకుళం