నక్క స్వైర విహారం
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:01 AM
డొంకూరు గ్రామంలో పిచ్చి నక్క మంగళవారం రాత్రి స్వైర విహారం చేసింది.
-12మందికి గాయాలు
ఇచ్ఛాపురం, డిసెంబరు 10 (ఆంరఽధజ్యోతి): డొంకూరు గ్రామంలో పిచ్చి నక్క మంగళవారం రాత్రి స్వైర విహారం చేసింది. దాని దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డొంకూరుకు చెందిన రైతులు మంగళవారం రాత్రి పొలాల్లో వరి నూర్పులు ముగించుకొని ఇంటికి వస్తుండగా చీకట్లో ఒక పిచ్చి నక్క దాడికి పాల్పడింది. అది కుక్కో.. నక్కో తెలియక గాయాలతో అంతా పరుగులు తీశారు. గ్రామానికి చెందిన యువకులు లైట్లతో వచ్చి చూడగా అది పిచ్చి నక్కగా గుర్తించి కర్రలతో కొట్టి హతమార్చారు. నక్క దాడిలో గ్రామానికి చెందిన దున్న ఝాన్సీ, దున్న మహాలక్ష్మి, శివంగి గణపతి, శింగారి ఈశ్వరి, పుక్కళ్ల రామారావు, ఎరిపల్లి జోగారావు, మాగుపల్లి కొండయ్య, జి.చిన్నారావు, దున్న హేమసుందర్, దున్న శంకర్‌తో పాటు ఎనిమిదేళ్ల పిల్లలు గవల శేషగిరి, నిర్మలకు గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అటవీశాఖ అదికారులు పర్యవేక్షణ లేకపోవటంతో వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని డొంకూరు గ్రామపెద్ద దున్న లోకనాథం అన్నారు.