Road accident: రెప్పపాటులో విషాదం
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:28 AM
Tragedy in srikakulam జిల్లాలోని మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
మిన్నంటిన రోదనలు
కోటబొమ్మాళి/ పలాస/ లావేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. కోటబొమ్మాళి మండలం శ్రీపురం జంక్షన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం దుప్పిలపాడు గ్రామానికి చెందిన సబ్బి అప్పన్న(38), పాకివలసకు చెందిన పిట్ట గంగయ్య(30) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. అప్పన్న అత్తవారి గ్రామం పాకివలస. అదే గ్రామానికి చెందిన పిట్ట గంగయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై శ్రీపురం సమీపంలో ఉన్న దాబాలో భోజనం చేశారు. తిరిగి వారిద్దరూ పాకివలస వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. వారిద్దరూ రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అప్పన్నకు భార్య లావణ్య, పిల్లలు ప్రియాంక, హారిక, మణికంఠ ఉన్నారు. గంగయ్యకు భార్య వాణిశ్రీ, కుమార్తె నిఖిత్, కుమారుడు దీక్షిత్ ఉన్నారు. అప్పన్న, గంగయ్య ఇద్దరూ కూలి చేస్తూ కుటుంబాలను పోషించేవారు. ఇంటి పెద్దదిక్కులను కోల్పోయామంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. దుప్పిలపాడు, పాకివలస గ్రామాల్లో రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
టెక్కలిపట్నంలో వ్యాపారి..
పలాస మండలం టెక్కలిపట్నం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శాసనపురి వెంకటరావు(55) మృతి చెందారు. ఈయన కాశీబుగ్గలో నివాసం ఉంటూ గొప్పిలి గ్రామంలో హార్డ్‌వేర్ షాపును నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఆయన శ్రీకాకుళం నుంచి గొప్పిలి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టెక్కలిపట్నం రోడ్డులో కుక్క అడ్డువచ్చింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో ఆయన తలకు తీవ్ర గాయాలై మృతి చెందారు. ఈయనకు భార్య సుగుణ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.
బుడుమూరులో వృద్ధుడు..
లావేరు మండలం బుడుమూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొడ్డ గోవిందరాజులు(66) మృతి చెందారు. గోవిందరాజులది విశాఖపట్నం జిల్లా గాజువాక. ఈయన బుడుమూరులో నివాసం ఉంటున్న తన కుమార్తె ఇంటికి పదిరోజుల కిందట వచ్చారు. గురువారం ఉదయం తన కుమార్తె ఇంటి వద్ద నుంచి బహిర్భూమికని వెళ్తూ రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో గోవిందరాజులు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు లావేరు ఏఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.