పాలసింగిలో మరో నాలుగు కిడ్నీకేసులు
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:19 AM
kidney cases in Palasingi కొన్నేళ్ల కిందట ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో అలజడి రేగుతోంది. నాలుగేళ్ల కిందట కిడ్నీ మహమ్మారి కేసు బయటపడింది. క్రమేపీ కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తమ గ్రామానికి ఏమైందంటూ.. గిరిజనుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కిడ్నీవ్యాప్తి గల కారణాలపై యంత్రాంగం అన్వేషిస్తోంది.
ఆందోళన చెందుతున్న గిరిజనులు
టెక్కలి రూరల్, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): కొన్నేళ్ల కిందట ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో అలజడి రేగుతోంది. నాలుగేళ్ల కిందట కిడ్నీ మహమ్మారి కేసు బయటపడింది. క్రమేపీ కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తమ గ్రామానికి ఏమైందంటూ.. గిరిజనుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కిడ్నీవ్యాప్తి గల కారణాలపై యంత్రాంగం అన్వేషిస్తోంది. వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం ముఖలింగపురం పంచాయతీ పాలసింగి గిరిజన గ్రామాన్ని కిడ్నీ వ్యాధి వేధిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు మృతి చెందగా.. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. దీనిపై ఈ నెల 9న ‘పాలసింగిలో కిడ్నీవ్యాధి’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై వైద్యశాఖ అధికారులు స్పందించారు. రెండు రోజుల నుంచి వైద్యశిబిరం నిర్వహించి రక్తనమూనాలు సేకరించారు. బుధవారం వైద్యాధికారిని భాగ్యశ్రీ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 25 మందికి రక్తనమూనాలు సేకరించగా.. అందులో నలుగురికి కిడ్నీవ్యాధి ప్రాథమిక దశలో ఉన్నట్టు తేలింది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బావిలో తాగునీరే కిడ్నీవ్యాధి వ్యాప్తికి కారణమని గ్రామస్థులు ఆరోపించగా.. మంగళవారం ప్రత్యేక వైద్యబృందాలు వచ్చి బావిలో తాగునీటిని పరిశీలించాయి. తాగునీటితో ఎటువంటి సమస్య లేదని చెప్పాయి. అధికంగా నొప్పిమాత్రలు వినియోగించడం వల్ల కిడ్నీవ్యాధి తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నాయి. కానీ బాధితులు మాత్రం తాము మందులు ఎప్పుడూ ఎక్కువగా వాడలేదని చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో తెలియక మిగిలిన గిరిజనులు సతమతమవుతున్నారు. చిన్నవయసు వారికి సైతం కిడ్నీవ్యాధి ప్రబలడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కిడ్నీ నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం కూడా వైద్యాధికారి భాగ్యశ్రీ, ఎంఎల్‌హెచ్‌పీ గాయత్రి, ఏఎన్‌ఎం ఉమా, హెల్త్ అసిస్టెంట్ పాల్గొణ తదితరులు వైద్యశిబిరంలో సేవలు అందించారు.