Share News

Railway line: ఒడిశాకు నాలుగు.. ఆంధ్రాకు ఒకటి

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:55 PM

Railways discriminates in train allocation గుణుపూర్‌-నౌపడ రైల్వేలైన్‌ నేరోగేజ్‌ నుంచి బ్రాడ్‌గేజ్‌గా స్థాయిపెరిగి దశాబ్ద కాలం దాటింది. ఈ మార్గంలో ఒడిశా వాసుల కోసం కేంద్రం నాలుగు రైళ్లను నడుపుతోంది. కానీ, ఆంధ్రా వారికి మాత్రం ఒక పాసింజర్‌ రైలునే పరిమితం చేసింది.

Railway line: ఒడిశాకు నాలుగు.. ఆంధ్రాకు ఒకటి
పాతపట్నం రైల్వేస్టేషన్‌

  • రైళ్ల కేటాయింపులో రైల్వేశాఖ వివక్ష

  • గుణుపూర్‌-నౌపడ మార్గంపై చిన్నచూపు

  • తెలుగువారికి ఒక్క పాసింజర్‌ రైలే దిక్కు

  • పాతపట్నం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): గుణుపూర్‌-నౌపడ రైల్వేలైన్‌ నేరోగేజ్‌ నుంచి బ్రాడ్‌గేజ్‌గా స్థాయిపెరిగి దశాబ్ద కాలం దాటింది. ఈ మార్గంలో ఒడిశా వాసుల కోసం కేంద్రం నాలుగు రైళ్లను నడుపుతోంది. కానీ, ఆంధ్రా వారికి మాత్రం ఒక పాసింజర్‌ రైలునే పరిమితం చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకుల వైఫల్యమా? లేక రైల్వేశాఖకు తెలుగువారంటే చులకనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

  • రైల్వేలైన్‌ నేపథ్యం..

  • పర్లాకిమిడి కృష్ణగజపతి మహారాజుల కాలంలో గుణుపూర్‌-నౌపడ నేరోగేజీ రైల్వేలైన్‌ను వేశారు. ఈ మార్గంలో గుణుపూర్‌-నౌపడ రైలు నాటిరాజుల పాలనకు గుర్తుగా నడిచేది. ప్రకృతి సోయగాల మధ్య బొగ్గు ఇంజిన్‌తో నడిచే ఈ రైలులో ప్రయాణం ప్రయాణికులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. నౌపడ నుంచి గుణుపూర్‌ వరకూ ఉన్న ప్రాంతాల్లోని చిన్నపాటి వర్తకుల జీవనోపాధికి ఈ రైల్వేసేవ ఎంతగానో ఉపకరించేది. అయితే, నిర్వాహణ భారం పెరగడంతో తగిన ఆదాయం రావడం లేదంటూ 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ మార్గం గుండా రైల్వే సేవలను నిలుపుదల చేసింది. దీనిపై ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారు. దీంతో ఈ మార్గాన్ని నేరోగేజ్‌ నుంచి బ్రాడ్‌గేజ్‌గా కేంద్రం మార్పు చేసింది. 2014లో బ్రాడ్‌గేజ్‌ పనులు పూర్తి చేయించి రైల్వే సేవలను పునరుద్ధరించింది. 2015 ఫిబ్రవరి 9న గుణుపూర్‌-విశాఖ పాసింజర్‌ను ఈ మార్గంలో ప్రారంభించింది.

  • ఒక రైలుతో సరి..

  • గుణుపూర్‌-నౌపడ బ్రాడ్‌గేజ్‌గా మారిన తరువాత ఈ దశాబ్ద కాలంలో ఒడిశాకు గుణుపూర్‌-విశాఖ పాసింజర్‌తోపాటు గుణుపూర్‌-రూర్కెళా (రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌), గుణుపూర్‌- కటక్‌ (మోమూ ఎక్స్‌ప్రెస్‌), గుణుపూర్‌-పూరీ(ఎక్స్‌ప్రెస్‌) సేవలు కల్పించారు. కానీ, ఆంధ్రాకు మాత్రం గుణుపూర్‌-విశాఖప్నటం పాసింజర్‌నే పరిమితం చేశారు. గుణుపూర్‌-విశాఖ పాసింజర్‌ విశాఖపట్నంలో ప్రతిరోజూ ఉదయం 6గంటలకు బయలుదేరి ఉదయం 11.30 గంటలకు గుణుపూర్‌కు చేరుతుంది. మళ్లీ మధ్యాహ్నం 3గంటలకు గుణుపూర్‌లో బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. రాత్రివేళ కావడంతో ఈ ప్రాంతవాసులు వైద్యసేవలు లేదా చదువుల కోసం విశాఖపట్నం వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు ప్రజలకు అక్కరకు రాని సమయంలో గుణుపూర్‌-విశాఖ పాసింజర్‌ను నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పాతపట్నం రైల్వే స్టేషన్‌లో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్‌ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల హిరమండలం, కొత్తూరు, సారవకోట, తెంబూరు తదితర ప్రాంతాల ప్రజలు ఒడిశాకు వెళ్లేందుకు రాజ్యరాణి సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి గుణుపూర్‌-నౌపడ మార్గంలో రైల్వే సేవలు పెంచాలని కోరుతున్నారు.

  • ట్రావెల్స్‌ బస్సులే దిక్కు..

  • పాతపట్నం నుంచి హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, తిరుపతి, బెంగళూరు తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు స్థానిక రైల్వేస్టేషన్‌లో ఎలాంటి రైళ్లు ఆగవు. దీంతో స్థానిక ప్రజలు ట్రావెల్స్‌ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 25 ట్రావెల్స్‌ బస్సులు పాతపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం వందలాది మంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లివస్తుంటారు. అంతటి ఆదరణ, అవసరం ఉన్నా పాతపట్నం రైల్వేస్టేషన్‌ నుంచి రైలు సేవలు కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Aug 10 , 2025 | 11:55 PM