Share News

DSC results : నాలుగు రోజులు ముందే..

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:19 AM

Appointment by the end of the month ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ముందడుగు వేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలో ఆగస్టు 15 నాటికి ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. నాలుగు రోజుల ముందే.. సోమవారం ఫలితాలు ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

DSC results : నాలుగు రోజులు ముందే..
డీఎస్సీ రాసిన అభ్యర్థులు (ఫైల్‌)

డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వం

నెలాఖరున పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం

రిజర్వేషన్‌ మేరకు అభ్యర్థుల ఎంపిక

నరసన్నపేట, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ముందడుగు వేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలో ఆగస్టు 15 నాటికి ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. నాలుగు రోజుల ముందే.. సోమవారం ఫలితాలు ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ఉమ్మడి జిల్లాలో 543 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్‌, మునిసిపాలిటీల్లో 458 పోస్టులతోపాటు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలో 85 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. జిల్లాలో సుమారు 34 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీకాకుళం, రాజాం , టెక్కలి, నరసన్నపేటలో జూన్‌ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలను నిర్వహించారు. ఒక్కో పోస్టుకు సుమారు 70 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. సోమవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్జీటీలు ఎక్కువగా అర్హత సాధించారు. దాదాపు 80 శాతం మేరకు అత్యధిక మార్కులు పొందారు. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులకు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించారు. 80శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 మందికిపైగా ఉన్నారు. 75శాతం నుంచి 80శాతం మార్కులు సాధించిన అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. వీరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

తుది జాబితా ఎంపికకు కసరత్తు

డీఎస్సీలో వచ్చిన మార్కులు ఆధారంగా జిల్లా సెలక్షన్‌ కమిటీ ఉపాధ్యాయులు ఎంపిక జాబితాను సిద్ధం చేయనుంది. ఈమేరకు విద్యాశాఖ మార్గదర్శికాలను జారీ చేసింది. ఎంపిక కమిటీకు జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను వివిధ రిజర్వేషన్లు ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. దివ్యాంగుల కోటాలో భర్తీ చేయునున్న పోస్టుల్లో సదరంలో ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్‌ బోర్డు ధ్రువీకరించిన తరువాతే వారిని పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్‌ పాఠశాలల్లో ఎస్జీటీ - 113, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ -81, సోషల్‌-70, బయాలజీ- 34, ఫిజికల్‌ సైన్సు -14, గణితం -33, ఇంగ్లిషు -65, హిందీ- 11, తెలుగు -37 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమపాఠశాలలో ఎస్జీటీ -33, సోషల్‌ -5, బయాలజీ-12, ఫిజికల్‌ సైన్సు -10, గణితం -13, ఇంగ్లిషు -12 పోస్టులు భర్తీ చేస్తారు.

నెలాఖరు నాటికి నియమాక పత్రాలు

డీఎస్సీలో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఈనెల 31 నాటికి నియమాక పత్రాలను అందజేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా సెలక్షన్‌ కమిటీ మంగళవారం సమావేశం కానునుంది. జిల్లాలో పూర్తిస్థాయిలో డీఈవో లేరు. ఇన్‌చార్జిలు కొనసాగుతున్నారు. ఉపాధ్యాయులకు నియమాక పత్రాలు ఇవ్వాలంటే పూర్తి అదనపు బాధ్యతలు లేక డీఈవోను నియమించాల్సి ఉంది.

తోలాపి యువకుడికి 96.4 మార్కులు

పొందూరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ ఫలితాల్లో పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన యువకుడు అన్నెపు శేషాద్రినాయుడు ప్రతిభ కనబరిచాడు. ఎస్జీటీ విభాగంలో శేషాద్రినాయుడు 96.40176 మార్కులు సాధించాడు. శేషాద్రినాయుడు తండ్రి అన్నెపు ధర్మారావు, తల్లి జగదాంబ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు. శేషాద్రినాయుడుకి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 12:19 AM