టీడీపీ బలోపేతానికి అనుబంధ కమిటీల ఏర్పాటు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:21 AM
టీడీపీ సంస్థాగతంగా బలోపేతానికి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
ఎచ్చెర్ల, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): టీడీపీ సంస్థాగతంగా బలోపేతానికి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. చిలకపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుబంధ విభాగాల్లో చురుగ్గా పనిచేసేందుకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు ముందుకు రావాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టో మేరకు సూపర్ సిక్స్‌ను అమలు చేసినట్టు చెప్పారు. ఇటీవల అమలు చేసిన స్త్రీ శక్తికి అపూర్వ ఆదరణ లభించిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, డీసీఎంఎస్ చైౖర్మన్ చౌదరి అవినాష్, పార్టీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, కళింగ కార్పొ రేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, నేతలు వావిలపల్లి రామకృష్ణ, పైడి ముఖలింగం, గాలి వెంకటరెడ్డి, మెండ రాజారావు, చిలక రాము తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
మెగా డీఎస్సీతో ప్రభుత్వం పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆయన విలే కరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విద్యారంగాన్ని దేశంలోనే తొలి స్థానం లో నిలిపేందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ జరగకుండా ఆపేందుకు మాజీ సీఎం జగన్మోహనరెడ్డి 24 కేసులు వేయించారని, వీటిని సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు చెప్పారు.