Housing : అమ్మేసుకున్నామోచ్!
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:16 AM
Signature forgery టెక్కలిలోని శ్యామసుందరాపురం రెవెన్యూ పరిధి జగతిమెట్ట జగనన్న ఇళ్ల కాలనీ 287, 288 సర్వే నెంబర్లలో రోజురోజుకీ అక్రమాలు బయటపడుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిలో కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఉండడం విస్మయం గొల్పుతోంది.

సంతకాలు ఫోర్జరీచేసి ఇళ్లపట్టాలు విక్రయించి..
జగతిమెట్ట జగనన్న కాలనీలో అక్రమాలెన్నో..
రోజుకో వ్యవహారం వెలుగులోకి వస్తున్న వైనం
గతంలో పనిచేసిన రెవెన్యూ సిబ్బంది చేతివాటం
బాధ్యులపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం
టెక్కలి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని శ్యామసుందరాపురం రెవెన్యూ పరిధి జగతిమెట్ట జగనన్న ఇళ్ల కాలనీ 287, 288 సర్వే నెంబర్లలో రోజురోజుకీ అక్రమాలు బయటపడుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిలో కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఉండడం విస్మయం గొల్పుతోంది. వైసీపీ హయాంలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి.. ఫోర్జరీ సంతకాలతో, పాత తేదీలతో ఇళ్ల పట్టాలు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో టెక్కలిలో పనిచేసిన వీఆర్‌వోలు, ఆర్‌ఐలు, డీటీ, తహసీల్దార్ల పాత్రపై విమర్శలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. జగతిమెట్ట ఇళ్ల కాలనీలో అక్రమాలు వెలికితీయాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల ఆర్డీవో ఇతర మండలాల నుంచి రెవెన్యూ సిబ్బందిని పిలిపించి విచారణ చేయించారు. అప్పట్లో జగతిమెట్ట కాలనీలో పట్టాలు పొందిన లబ్ధిదారులు ఎవరు, పట్టాలు తీసుకున్న వారే ఉన్నారా?, వేరెవరు ఉన్నారా? అని ఆరా తీయగా సగం అక్రమాలు బయటపడ్డాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగతిమెట్ట లేఅవుట్‌లో 332 మందికి పట్టాలు జారీచేస్తే.. రెవెన్యూ సిబ్బంది పరిశీలనలో 55 మంది మాత్రమే పట్టాలు పొందిన లబ్ధిదారులు అక్కడ ఉన్నారు. మిగిలిన 277మంది లబ్ధిదారుల జాడ కనిపించలేదు. దీంతో రెవెన్యూ అధికారులు అక్కడ పట్టాలు పొందిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే తహసీల్దార్, సబ్‌కలెక్టర్ కార్యాలయాలకు హాజరు కావాలని వారం రోజులు గడువు సైతం ఇచ్చారు. కనీసం 50 మంది లబ్ధిదారులైనా దర్యాప్తు అధికారుల వద్దకు హాజరుకాలేదు. దీంతో రెవెన్యూ అధికారులకు మరింత అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్డీవో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. గతంలో పనిచేసిన వీఆర్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బందిని సబ్‌కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఇళ్లకాలనీలో అక్రమాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో కొంతమంది రెవెన్యూ సిబ్బంది తప్పులు బయటపడ్డాయి. రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి.. పట్టాలను అనర్హులకు విక్రయించినట్టు తేలింది. దీంతో అక్రమాలకు పాల్పడిన వారిపై వేటుకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా అప్పట్లో తహసీల్దార్ కార్యాలయంలో పట్టాలు ఇచ్చిన జాబితాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది.
ఇటీవల రెవెన్యూ అధికారులు జగతిమెట్ట కాలనీలో ఇంటింటికీ సర్వే చేస్తూ పట్టాలు చూపని ఇళ్లు, ఖాళీ స్థలాలపై ‘ఇది ప్రభుత్వ స్థలం.. ఆక్రమిస్తే చర్యలు తప్పవు’ అని బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. వాస్తవానికి రెవెన్యూ అధికారులు అక్కడ ఇచ్చిన పట్టాలు 332 అయితే ప్రస్తుతం 420కు పైగా లేఅవుట్లు కనిపిస్తున్నాయంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతోంది. అప్పట్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొందరు ఇళ్ల పట్టాలు అక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం రెవెన్యూ సిబ్బంది తాజా తనిఖీలతో.. ఆయా అక్రమార్కుల్లో అలజడి రేగుతోంది.
ఈ విషయమై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా ‘అప్పట్లో పనిచేసిన రెవెన్యూ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం. కొంతమంది ఇంటిదొంగలను గుర్తించాం. త్వరలో మరింత దర్యాప్తు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.