Share News

తేలినీలాపురంలో విదేశీ పక్షులు

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:13 AM

Unmissable facilities at the resort విదేశీ పక్షులతో టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామం కళకళలాడుతోంది. సైబీరియా, బర్మా, బంగ్లాదేశ్‌, ఆస్ర్టేలియా తదితర దేశాల నుంచి ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో ఫెలికాన్స్‌, నత్తగుల్ల కొంగలు, తెల్లకంకణాలు తదితర పక్షులు తేలినీలాపురంతోపాటు ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి గ్రామాలకు చేరుకుంటాయి.

తేలినీలాపురంలో విదేశీ పక్షులు
తేలినీలాపురంలో విదేశీపక్షుల సందడి

  • విడిది కేంద్రంలో కానరాని సౌకర్యాలు

  • పర్యాటకులకు తప్పని ఇబ్బందులు

  • టెక్కలి రూరల్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): విదేశీ పక్షులతో టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామం కళకళలాడుతోంది. సైబీరియా, బర్మా, బంగ్లాదేశ్‌, ఆస్ర్టేలియా తదితర దేశాల నుంచి ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో ఫెలికాన్స్‌, నత్తగుల్ల కొంగలు, తెల్లకంకణాలు తదితర పక్షులు తేలినీలాపురంతోపాటు ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి గ్రామాలకు చేరుకుంటాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ సంతానోత్పత్పి చేస్తాయి. వాటి పిల్లలతో ఏప్రిల్‌లో తిరుగు పయనమవుతాయి. ఈ క్రమంలో ఇప్పటికే తేలినీలాపురానికి విదేశీ పక్షులు రాగా.. కార్తీకమాసం వేళ పర్యాటకుల సందడి పెరిగింది. జిల్లాతోపాటు విశాఖపట్నం, విజయనగరం, గోదావరి తదితర జిల్లాలు, ఒడిశా రాష్ట్రం నుంచి అధికంగా పర్యాటకులు వస్తున్నారు. కాగా.. తేలినీలాపురంలోని విడిది కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు.

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో తేలినీలాపురానికి పర్యాటకశాఖ నిధులు కేటాయించింది. అంతర్గత రహదారులు, చిల్డ్రన్‌ పార్క్‌ నిర్మించారు. పక్షులు జీవన విశేషాలు, ఇతర సమాచారాన్ని తెలిపే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసస్థాయిలో విడిది కేంద్రాన్ని పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారింది. కేంద్రం చుట్టూ ప్రహరీ, విదేశీ పక్షులను చూసే టవర్లు పాడైపోయాయి. మరుగుదొడ్లు, తాగునీటి వసతి కూడా లేదు. దీంతో విడిది కేంద్రానికి వచ్చిన పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. చిల్డ్రన్‌ పార్క్‌ కూడా మూతపడడంతో చిన్నారులు ఆడుకునేందుకు వీల్లేకుండా పోయింది. ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కేంద్రాన్ని పరిశీలించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పక్షుల సంరక్షణతోపాటు పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

  • ప్రతీ పక్షి ప్రత్యేకం

  • ఫెలికాన్స్‌ (గూడబాతులు): తేలినీలాపురంలో ఫెలికాన్స్‌ పక్షులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి సైౖబీరియా, బర్మా, బంగ్లాదేశ్‌, ఆస్ర్టేలియా దేశాల నుంచి వచ్చాయి. ఇవి 3 అడుగుల ఎత్తు, ఐదారు కిలోల బరువు ఉంటాయి. పొడవైన రెక్కలు, ముక్కు కింద గూడులాంటి సంచి ఉంటుంది. 2 కిలోల వరకు వేటాడిన చేపలను పట్టుకుని ఎగురగలవు. 2 నుంచి 3 గుడ్లు పెట్టి 30రోజుల పాటు పొదిగి పిల్లలను చేస్తాయి.

  • నత్తగుల్ల కొంగలు(ఓపెన్‌బిల్డ్‌ స్టోర్క్‌): ఈ పక్షులు 3 కిలోల బరువు ఉండి.. బూడిద నలుపు రంగులో ఉంటాయి. ముక్కు పట్టకర్ర ఆకారంలో ఉంటుంది. నత్తల పైభాగంలో ఉన్న పెంకును ముక్కు సాయంతో పగలకొట్టి మాంసాన్ని తింటుంది. ఇది నీటిలో దిగి ఈదలేదు. గుంతలు, చిత్తడినేలల్లో తిరుగుతూ ఆహారాన్ని సేకరిస్తాయి. ఈ పక్షులు ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లో అధికంగా కనిపిస్తున్నాయి.

  • తెల్లకంకణాలు (వైట్‌ఐబీస్‌): శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్‌, కంబోడియా, మంగోళియా, దేశాలు నుంచి ఈ పక్షులు వస్తాయి. రెండు కిలోల వరకు బరువు, నల్లని వంపు తిరిగిన ముక్కుతో తెల్లగా కోడి పెట్టలా కనిపిస్తాయి. ముక్కుతో పీతలు, నీటి పాములను పట్టుకుంటాయి. 3 నుంచి 4 గుడ్లు పెట్టి 21 రోజుల్లో పిల్లలను చేస్తాయి.

  • చిన్న నీటికాకులు (లిటిల్‌ కార్మోరెంట్స్‌): ఈ పక్షులు పెద్ద సరస్సులతోపాటు చెరువుల్లో కనిపిస్తాయి. 2 కిలోల వరకు బరువు ఉంటాయి. నీటిలో మునిగి చేపలను వేటాడుతాయి. కాకి అకారంలో నల్లగా ఉంటుంది. 4 గుడ్లు పెట్టి 21 రోజుల్లో పిల్లలను చేస్తాయి.

  • స్పూస్‌బిల్స్‌(తెడ్డుముక్కు కొంగ): ఈ పక్షులు ఆస్ట్రేలియా, గుజరాత్‌ ప్రాంతాల నుంచి వస్తాయి. 2.5 కిలోలు బరువు, పడవ నడిపే తెడ్డులా ముక్కు ఉంటుంది. తలపై నెమలి పింఛంలా వెంట్రుకలు ఉంటాయి. 3 నుంచి 4 గుడ్లుపెట్టి 21 రోజుల్లో పిల్లలను చేస్తాయి.

Updated Date - Nov 19 , 2025 | 12:13 AM