సేవా మార్గాన్ని అనుసరించాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:53 PM
Bhagwan Sathya Sai Jayanti celebrations ‘అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు’ అన్న భగవాన్ సత్యసాయిబాబా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మానవసేవే మాధవసేవగా జీవితాన్ని గడపాలని కేంద్రపౌర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ప్రధాన సత్యసాయి బాబా ఆలయంలో అదివారం ఘనంగా బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
ఘనంగా భగవాన్ సత్యసాయి జయంతి
పాత శ్రీకాకుళం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు’ అన్న భగవాన్ సత్యసాయిబాబా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మానవసేవే మాధవసేవగా జీవితాన్ని గడపాలని కేంద్రపౌర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ప్రధాన సత్యసాయి బాబా ఆలయంలో అదివారం ఘనంగా బాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై సత్యసాయిబాబా విగ్రహానికి పూలమాల వేసి, ఆలయ కమిటీ సభ్యులతో కేకును కత్తిరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యసాయిబాబా జయంతిని ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తోందన్నారు. రాయలసీమకు మంచినీరు, ప్రపంచస్థాయిలో విద్య ఉచిత వైద్యసేవలను అందించిన మహనీయుడు సాయిబాబా అని తెలిపారు. భావితరాలకు అదర్శమూర్తుల జీవితాలను తెలియజేస్తున్న తల్లిదండ్రులను కేంద్రమంత్రి ప్రశంసించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ... సత్యసాయి సందేశంతో ప్రేరణ పొందిన భక్తులు దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో సత్యసాయి సేవాసమితి చేస్తున్న సేవలను అభినందించారు. ప్రతి సోమవారం జిల్లా పరిషత్తు వద్ద వినతుల కార్యక్రమంలో దాదాపు 200 మంది అర్జీదారులకు భోజనాలు అందించడం, 15 ఏళ్లుగా పెద్ద ఆసుపత్రి వద్ద నిరంతరంగా అన్నదానం చేసే సేవా కార్యక్రమాలను కొనియాడారు. విపత్తులు, తుఫాన్‌ల సమయంలో స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్న వలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. వేడుకల్లో డీఆర్వో లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయి ప్రత్యూష, మెండ దాసునాయుడు, ఆలయ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు అందవరం ప్రసాద్, పాండ్రంకి శంకర్, విస్సు దేవళ్ల, సాయి భక్తులు పాల్గొన్నారు.