Share News

‘పది’ పాఠ్యాంశాల్లో ఉత్తరాంధ్ర జానపద కళలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:09 AM

Folk arts of Uttarandhra పదోతరగతి పాఠ్యపుస్తకాల్లో ఉత్తరాంధ్ర జానపద కళలకు రాష్ట్ర ప్రభుత్వం చోటు కల్పించింది. పలాస మండలం రంగోయి గ్రామానికి చెందిన జానపద కథా రచయత, కళాకారుడు, జానపద పరిశోధకుడు బద్రి కూర్మారావు రచనలు కొన్ని సేకరించి.. తెలుగు వాచకంలో ముద్రించింది.

‘పది’ పాఠ్యాంశాల్లో ఉత్తరాంధ్ర జానపద కళలు
పదో తరగతి పుస్తకంలో కూర్మారావు రచించిన జానపదకళలు

తెలుగువాచకంలో కూర్మారావు రచనలు

పలాస వాసికి అరుదైన గుర్తింపు

పలాస/ పలాస రూరల్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పదోతరగతి పాఠ్యపుస్తకాల్లో ఉత్తరాంధ్ర జానపద కళలకు రాష్ట్ర ప్రభుత్వం చోటు కల్పించింది. పలాస మండలం రంగోయి గ్రామానికి చెందిన జానపద కథా రచయత, కళాకారుడు, జానపద పరిశోధకుడు బద్రి కూర్మారావు రచనలు కొన్ని సేకరించి.. తెలుగు వాచకంలో ముద్రించింది. కూర్మారావు పరిశోధనలు చేసి ‘ఉత్తరాంధ్ర జానపద కళలు’ అనే గ్రంథాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. వీటిలో తప్పెటగుళ్లు, జముకులపాట, గిరిజన సంప్రదాయ నృత్యం థింసా వంటి కళల ప్రత్యేకతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిని పదో తరగతి ‘తెలుగు పరిమళం’ పుస్తకంలో ముద్రించింది. ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన జానపదం తప్పెటగుళ్లు ప్రదర్శన ఎంతో ప్రాచుర్యం పొందింది. దేశవిదేశాల్లో కళాకారుల ప్రదర్శన అనేకమంది ప్రశంసలు అందుకుంది. రంగస్థలం సినిమాలో కూడా దీనికి చోటుకల్పించి ఉత్తరాంధ్ర జానపదాన్ని గుర్తించారు. దీంతోపాటు ప్రాచీనమైన జముకులపాట, గిరిజన నృత్యం ఽథింసాకు కూడా పాఠ్యాంశంలో చోటుకల్పించడంతో ఉత్తరాంధ్ర కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌ తరాలకు జానపద కళలపై అవగాహన పెరిగి మరింత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న జానపదాలను వెలుగులోకి తీసుకువచ్చి గ్రంథంగా మలచిన కూర్మారావును ప్రశంసిస్తున్నారు. ఇదిలా కూర్మారావు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాంఘిక సంక్షేమశాఖ ఆశ్రమ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందారు. ఆయన తండ్రి బద్రి అప్పన్న పేరుమీద జానపదకళాజాతను ఏటా జనవరి 11న నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఉత్తరాంధ్ర జానపదకళాకారులకు సత్కారంతో పాటు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంటారు.

గౌరవంగా భావిస్తున్నా

పదోతరగతి పాఠ్యాంశంలో నా గ్రంఽథం నుంచి తీసుకున్న జానపద కళలను ప్రచురించడం ఆనందంగా ఉంది. ఇది ఉత్తరాంధ్ర జానపకళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రూపకర్తలకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో కూడా మన జానపదాలకు తగిన స్థానం కల్పించాలి.

- బద్రి కూర్మారావు, ఉత్తరాంధ్ర జానపదకళలు రచయత

Updated Date - Aug 12 , 2025 | 12:09 AM