పునరావాస అంశాలపై దృష్టి సారించండి
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:10 AM
మూలపేట పోర్టు నిర్వాసితుల పునరావాస అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టు నిర్వాసితుల పునరావాస అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పునరావాస గ్రామాల నిర్మాణం, స్థలాల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన, గృహ నిర్మాణాలు, తాగునీటి సరఫరా, రహదారుల అనుసంధానం, పునరావాస ప్రక్రియ, విశేష గ్రామాల పరిధిలోని ఖాళీ స్థలాల వినియోగంపై అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. పోర్టు రహదారికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు, రైల్వే మార్గంలో చేయాల్సిన సాంకేతిక మార్పులపై సమీక్షించారు. ఇతర శాఖల సమన్వయంతో జరుగుతున్న పనుల వివరాలను అధికారులు కమిటీకి సమర్పించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, పంచాయతీరాజ్, నీటి పారుదల, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు.