Share News

గృహ నిర్మాణ బకాయిలపై దృష్టి

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:01 AM

housing construction arrears ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల బిల్లుల బకాయిల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించారు.

గృహ నిర్మాణ బకాయిలపై దృష్టి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల బిల్లుల బకాయిల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించారు. 2014-19 మధ్య జిల్లావ్యాప్తంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు సంబంధించి రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉండడంపై అధికారులను నిలదీశారు. నిర్మాణంలో ఉన్న కాలనీల పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రజలకు సత్వర సేవలు అందించే విషయంలో అలస్యానికి తావు లేదన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి వాహనాల నమోదు, రైతు సేవా కేంద్రాల తనిఖీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, ఆసుపత్రుల్లో మందుల పంపిణీ, డయాగ్నోస్టిక్‌ సేవలు పకడ్బందీగా చూడాలన్నారు. రాబీస్‌, పాముకాటు, వ్యాక్సిన్‌, యాంటీ వీనమ్‌ నిల్వలు సరిపడా ఉండాలని ఆదేశించారు. జి.సిగడాం, కవిటి, పొందూరులో సాంకేతిక సమస్యల కారణంగా పలు అంశాలు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, కోర్టు కేసుల పెండింగ్‌పై సమీక్షించారు. అన్నదాత సుఖీభవ, రెగ్యులరైజేషన్‌, ఈ-పంట నమోదు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ డి.పృథ్వీరాజ్‌కుమార్‌, డీఆర్వో లక్ష్మణమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు జయదేవి, పద్మావతి, ఆయా శాఖల జిల్లాస్థాయి, డివిజనల్‌ స్థాయి అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:01 AM