Share News

Cashew Prices: నిలకడలేని జీడి ధర

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:01 AM

Cashew farmers impact జీడిపిక్కల ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. రెండు నెలల్లోనే బస్తాకు రూ.వెయ్యి పతనమైంది. మిగిలిన వాణిజ్య పంటల వలే జీడిపంటకు ధరల స్థిరీకరణ లేకపోవడం ఉద్దానం రైతులకు శాపంగా మారుతోంది.

Cashew Prices: నిలకడలేని జీడి ధర

  • రెండు నెలల్లో రూ.వెయ్యి పతనం

  • ప్రస్తుతం 80కిలోల పిక్కల బస్తా రూ.12,500

  • దళారీ వ్యవస్థతో రైతులకు నష్టాలు

  • వజ్రపుకొత్తూరు, జూలై 20(ఆంధ్రజ్యోతి): జీడిపిక్కల ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. రెండు నెలల్లోనే బస్తాకు రూ.వెయ్యి పతనమైంది. మిగిలిన వాణిజ్య పంటల వలే జీడిపంటకు ధరల స్థిరీకరణ లేకపోవడం ఉద్దానం రైతులకు శాపంగా మారుతోంది. ఎప్పుడు ధర పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియక సతమతమవుతున్నారు. పంటను ఎప్పుడు అమ్ముకోవాలో తెలియక నష్టపోతున్నారు. జీడి వ్యాపారాన్ని దళారీ వ్యవస్థ శాసిస్తోందని, ధరలు పెరగకుండా వారే అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

  • ఇదీ పరిస్థితి..

  • జిల్లాలో ఈ ఏడాది 24వేల హెక్టార్లలో జీడి పంట సాగైంది. లక్ష బస్తాల పిక్కలు దిగుబడి ఉంటుందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. మే నెలలో 80కిలోల బస్తా ధర రూ.13,500 ఉండగా, ఇప్పుడు రూ.12,500కు పడిపోయింది. రెండు నెలల్లోనే బస్తా ధర రూ.వెయ్యి పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటపై ఆదాయం కంటే మదుపులు, రవాణాకే వ్యయం అధికమవుతోందని వాపోతున్నారు. ధరల స్థిరీకరణ లేకపోవడంతో రానున్న రోజుల్లో కూడా జీడిపిక్కల ధరలు మరింత తగ్గుతాయేమోనని కలవరపడుతున్నారు. జిల్లాలోని పలాసతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న జీడి పరిశ్రమలకు ప్రతి ఏడాదీ 5 లక్షల బస్తాల పిక్కలు(బస్తా 80కిలోలు) అవసరం ఉంటుంది. అయితే, ఈ ఏడాది జిల్లాలో లక్ష బస్తాల దిగుబడి మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి జీడిపిక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇది జిల్లా రైతుల పాలిట శాపంగా మారింది. విదేశీ పిక్కలతో ఉద్దానంలో పండే పంటకు డిమాండ్‌ తగ్గుతోంది. ధరలు కూడా తగ్గుతున్నట్లు రైతులు చెబుతున్నారు.

  • ధరల స్థిరీకరణతో మేలు

  • జీడి ధరల స్థిరీకరణ చేపడితేనే రైతులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి రైతులను మోసం చేసింది. బస్తాకు రూ.వెయ్యి అదనంగా చెల్లిస్తామని చెప్పింది. కానీ, ఒక్క రైతుకూ అందినపాపాన పోలేదు. ముఖ్యంగా ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరుగుతుండడంతో జీడి సాగు రైతులకు భారంగా మారింది. అప్పులు చేసి అధిక పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తున్నా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. మరోపక్క దళారీ వ్యవస్థతో రైతులు మోసపోతున్నారు. గతంలో వ్యాపారులే నేరుగా రైతుల నుంచి జీడిపిక్కలను కొనుగోలు చేసేవారు. నచ్చిన ధరకు రైతులు పంటను విక్రయించేవారు. ప్రస్తుతం దళారులే గ్రామాలకు వచ్చి పిక్కలను కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగకుండా దళారులే అడ్డుకుంటున్నారనే రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిగిలిన వాణిజ్య పంటల వలే జీడిపంటకు గిట్టుబాటు కల్పించి, ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దళారీ వ్యవస్థను నియంత్రించాలని విన్నవిస్తున్నారు.

  • అధికారులు దృష్టి సారించాలి

  • జీడిపిక్కల ధరలు స్థిరీకరణ జరిగితేనే రైతులకు మేలు జరుగుతుంది. ధరల హెచ్చుతగ్గులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనివల్ల పంటను ఎప్పుడు అమ్ముకోవాలో తెలియక అయోమయం చెందుతున్నారు. గిట్టుబాటు ధరపైనా అధికారులు దృష్టిని కేంద్రీకరించాలి.

    - కోనేరు కామేశ్వరరావు, బైపల్లి

  • దళారులతో మోసపోతున్నాం

  • జీడిపిక్కలను ఒకప్పుడు వ్యాపారులు నేరుగా రైతుల నుంచి కోనుగోలు చేసేవారు. ప్రస్తుతం దళారులే గ్రామాలకు వచ్చి పిక్కలను కొనుగోలు చేస్తున్నారు. వారే ధరలను నిర్ణయిస్తున్నారు. మా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యాపారాలకు ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగకుండా చేసి రైతులను మోసం చేస్తున్నారు.

    - జోగి తిరుపతిరావు, రైతు, గుణుపల్లి

Updated Date - Jul 21 , 2025 | 12:01 AM