Share News

Schools problems: వర్షపునీరు.. నిల‘బడి’

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:57 PM

Flooding problem జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు వెంటాడుతున్నాయి. వర్షం కురిస్తే చాలు.. పాఠశాలల ఆవరణలో నీరు నిలిచిపోవడం.. కొన్నిచోట్ల తరగతి గదుల్లో వరదనీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Schools problems: వర్షపునీరు.. నిల‘బడి’
చెరువును తలపిస్తున్న జాడుపల్లి ఉన్నత పాఠశాల(ఫైల్‌)

  • ప్రభుత్వ పాఠశాలలకు వరద ముంపు సమస్య

  • ‘నాడు-నేడు’ పేరిట నిధులు వృథా

  • అసంపూర్తిగా అభివృద్ధి పనులు

  • విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

  • మెళియాపుట్టి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలం జాడుపల్లి జిల్లాపరిషత్‌ పాఠశాలలో 142మంది విద్యార్థులు చదువుతున్నారు. మూడేళ్ల కిందట నాడు-నేడు పథకం కింద ఈ పాఠశాలకు భవనాలతోపాటు ప్రహరీ నిర్మాణానికి రూ.26లక్షల నిధులు మంజూరు చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు మధ్యలో నిలిపేశారు. ఇటీవల కురిసిన వర్షానికి పాఠశాల చెరువులా మారింది. తరగతి గదుల్లోకి నీరు చేరడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కొండల నుంచి వచ్చిన నీరు పాఠశాలలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • టెక్కలి మండలం నర్సింగపల్లి మండల పరిషత్‌ పాఠశాలలో 42మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షం కురిస్తే చాలు పాఠశాల ఆవరణలో నీరు నిలిచి.. తరగతి గదుల్లోకి వెళ్లలేని పరిస్థితి. గతంలో నాడు-నేడు పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. కానీ పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేదు. పాఠశాల ఆవరణలో కంకర వేసి ఎత్తు చేయకపోవడంతో నీరు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

  • ... ఇలా జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు వెంటాడుతున్నాయి. వర్షం కురిస్తే చాలు.. పాఠశాలల ఆవరణలో నీరు నిలిచిపోవడం.. కొన్నిచోట్ల తరగతి గదుల్లో వరదనీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేశామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధమనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 1,954 ప్రాథమిక, 268 ప్రాథమికోన్నత, 416 జిల్లా పరిషత్‌ పాఠశాలలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకం కిందట తొలివిడత 958 పాఠశాలల అభివృద్ధికి రూ.246.72కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపింది. రెండో విడతలో 1,058 పాఠశాలలకు రూ.445.34 కోట్లు వెచ్చించినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా.. అధికంగా నిధులు ఖర్చు చేసినా పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే చాలు.. పలు పాఠశాలల ఆవరణ, తరగతి గదుల్లో నీరు నిలిచిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వరదనీటిలోనే చదువులు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో బిల్లులు సక్రమంగా చెల్లించక.. చాలాచోట్ల పనులు మధ్యలో వదిలేశారు. అప్పట్లో కొంతమంది వైసీపీ నేతలు కాంట్రాక్టర్లుగా వ్యవహరించడంతో పనుల్లో నాణ్యత పాటించ లేదనే ఆరోపణలు ఉన్నాయి. నాడు-నేడు పనుల్లో అవకతవకలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటిపై విచారణ చేపడుతోంది. అక్రమాల లెక్క తేలేవరకూ పాఠశాలల్లో పనులు చేపట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలకు వరద ముంపు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

  • ఆదేశాలు లేవు

  • గత ప్రభుత్వ హయాంలో మధ్యలో వదిలేసిన ‘నాడు-నేడు’ పనులు చేపట్టాలని ఆదేశాలు లేవు. రెండో విడతలో అధికంగా పనులు చేసినవారికి బిల్లులు చెల్లించాల్సి ఉంది. కొన్ని పాఠశాలల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. తాత్కాలిక పనులు చేపడతాం.

    - ఎం.పద్మనాభం, ఎంఈవో 2, మెళియాపుట్టి

Updated Date - Sep 18 , 2025 | 11:57 PM