Share News

Fishing : హైలెస్సా... హైలెస్సా

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:33 PM

Fishermen activities in the sea రెండు నెలల విరామం తర్వాత సంద్రంలో మోటారు, మెకనైజ్డ్‌ బోట్లతో చేపల వేట పునఃప్రారంభమైంది. చేపలు గుడ్లు పెట్టే దశలో మోటారు, మెకనైజ్డ్‌ బోట్లతో వేటాడితే మత్స్యసంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14న అర్థరాత్రి వరకు సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రితో వేట నిషేధం గడువు ముగిసింది.

Fishing : హైలెస్సా... హైలెస్సా
బందరువానిపేట తీరంలో..

  • సముద్రంలో చేపల వేట పునఃప్రారంభం

  • తీర ప్రాంతాల్లో మత్స్యకారుల సందడి

  • ఎచ్చెర్ల/ గార/ పాత శ్రీకాకుళం, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): రెండు నెలల విరామం తర్వాత సంద్రంలో మోటారు, మెకనైజ్డ్‌ బోట్లతో చేపల వేట పునఃప్రారంభమైంది. చేపలు గుడ్లు పెట్టే దశలో మోటారు, మెకనైజ్డ్‌ బోట్లతో వేటాడితే మత్స్యసంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14న అర్థరాత్రి వరకు సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రితో వేట నిషేధం గడువు ముగిసింది. ఆదివారం వేకువజామునే గంగపుత్రులు బోట్లతో చేపలవేటకు బయలుదేరారు. సముద్ర తీరంలో ఎక్కడ చూసినా మత్స్యకారుల సందడి కనిపించింది. జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరముంది. 11 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సుమారు వెయ్యి మోటారైజ్డ్‌ బోట్లతో మత్స్యకారులు వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, గార మండలం బందరువానిపేట తదితర సముద్ర తీరంలో మత్స్యకారులు ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో వేట ప్రారంభించారు. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో కొద్దిమంది మాత్రమే చేపల వేటకు వెళ్లారు. చాలామంది సంప్రదాయ తెప్పలతోనే వేట సాగించారు. కొద్దిమంది మాత్రమే మోటారు బోట్లను వినియోగించారు. వేట ముగించుకుని.. ఉదయం 11 గంటల తర్వాత బోట్ల ఒడ్డుకు చేరుకున్నారు. కాగా.. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అరకొరగానే చేపల వేట సాగినట్టు మత్స్యకారులు తెలిపారు.

  • వేట సరిగా లేదు

  • సముద్రంలో అలలు తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో చేపల వేట సరిగా సాగలేదు. రెండు నెలల తర్వాత వేటకు బయలుదేరాం. వేట సరిగా లేకపోవడంతో నిరాశకు గురయ్యాం. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలానే ఉంటుంది.

  • - గనగళ్ల రామారావు, డి.మత్స్యలేశం

  • ...................

  • కష్టమే మిగిలింది

  • ఆదివారం వేకువజామునే చేపల వేటకు బయలుదేరాం. వాతావరణ పరిస్థితులు సరిగా లేని కారణంగా చాలామంది చేపల వేటకు రాలేదు. ఒకటి, రెండు మోటారు బోట్లు మినహా మిగిలినవన్నీ సంప్రదాయ తెప్పలతోనే వేట సాగింది. ఆశించినస్థాయిలో మత్స్య సంపద లభ్యం కాక.. కష్టమే మిగిలింది.

    - కుందు లక్ష్మణరావు, డి.మత్స్యలేశం

    ...................

  • రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి

  • సముద్ర తీర ప్రాంతాల్లో ఆదివారం నుంచి వేట పునః ప్రారంభమైంది. జిల్లాలో 15,548 మంది మత్స్యకారులు చేపలవేటపై జీవనం సాగిస్తున్నారు. వేట నిషేధ సమయంలో పరిహారం ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.20వేలు చొప్పున రూ.31.09 కోట్లు అందజేసింది. జిల్లాలో సుమారు 1600 మోటరైజ్డ్‌ బోట్లు, 2700 ఇంజిన్‌ లేని చిన్న బోట్లు ఉన్నాయి. బోట్లకు ఇండియా యూనిట్‌ కోడ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. మూడేళ్లకోసారి రిజిష్ట్రేషన్‌ను రెన్యువల్‌ చేసుకోవాలి.

    - వై.సత్యనారాయణ, మత్స్యశాఖ ఉప సంచాలకుడు

Updated Date - Jun 15 , 2025 | 11:33 PM