వేటకు వెళ్లి.. సరిహద్దు దాటి
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:23 AM
Fishermen being caught by foreign coast guards మత్స్యకారులకు వలసబాట ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా, వారి కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని ప్రకటిస్తున్నా మత్స్యకారుల తలరాతలు మారడం లేదు.
విదేశీ కోస్టుగార్డులకు చిక్కుతున్న మత్స్యకారులు
నెలల తరబడి బందీలుగా..
మారని గంగపుత్రుల బతుకులు
స్థానికంగా ఉపాధి లేక తప్పని వలసబాట
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
2018 నవంబరు 30న ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం మత్స్యకారులు పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కారు. గుజరాత్ నుంచి అరేబియా మహా సముద్రంలో చేపలవేటకు బయలుదేరిన వీరు పాకిస్థాన్ సరిహద్దు జలాల్లో ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్టుగార్డులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ జైల్లో 13 నెలల పాటు మగ్గిపోయారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో 2020 జనవరి 6న విడుదలయ్యారు.
.................
తాజాగా బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన 8 మంది మత్స్యకారులు సముద్రంలో చేపలవేట సాగిస్తూ.. బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లో ప్రవేశించారు. అక్కడి కోస్టుగార్డు సిబ్బంది ఆ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మత్స్యకారులు, వారి కుటుంబాల్లో అలజడి రేగుతోంది.
రణస్థలం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మత్స్యకారులకు వలసబాట ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా, వారి కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని ప్రకటిస్తున్నా మత్స్యకారుల తలరాతలు మారడం లేదు. రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ 193 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 164 మత్స్యకార గ్రామాలున్నాయి. జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు కానీ, జెట్టీలు కానీ అందుబాటులో లేకపోవడంతో మత్స్యకారులు సంప్రదాయ రీతిలో వేటకే పరిమితమయ్యారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు గాక జిల్లా నుంచి వేలాది మంది మత్స్యకారులు చెన్నై, గుజరాత్, ముంబాయి, పారాదీప్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. జిల్లాలో 60 వేల మంది మత్స్యకారులు ఉండగా.. అందులో 32వేల మంది ఉపాధి కోసం వలస బాట పట్టారంటే ఎలాంటి దుస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. వేటలో భాగంగా విదేశీ జలాల్లోకి ప్రవేశించి అక్కడి కోస్టుగార్డులకు చిక్కుతున్నారు. ఖైదీలుగా మారుతున్నారు. ఇటువంటి ఘటనలు ఎన్నో గతంలో జరిగాయి. ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారు ఉన్నారు. అటువంటి విషాద సమయాల్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు గుప్పిస్తున్నారు. తరువాత వాటి గురించే మరిచిపోతున్నారు. మత్స్యకారులకు సాంత్వన కలిగే శాశ్వత ప్రాజెక్టులేవీ జిల్లాలో నిర్మాణం కావడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో మాత్రం హార్బర్లు, జెట్టీల నిర్మాణం తక్కువే. చాలా రాష్ట్రాల్లో సగటున 30 కిలోమీటర్లకు ఒక జెట్టీని నిర్మించారు. కానీ ఇక్కడ మాత్రం మచ్చుకైనా కానరావడం లేదు. టీడీపీ హయాంలో భావనపాడులో హార్బర్ నిర్మాణానికి తలపెట్టగా దానిని మూలపేటకు మార్చారు. 2024 ఎన్నికలకు ముందు పనులు ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఇది పూర్తయితే మత్స్యకారులకు లబ్ధి కలుగనుంది.
కంటితుడుపు చర్యలే
ప్రభుత్వ రాయితీలు, పథకాల విషయంలో మత్స్యకారులు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు. వేట నిషేధ సమయంలో అందించే ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ఇప్పటికీ చాలామంది అర్హులకు లబ్ధి అందలేదు. వేటలో భాగంగా కంటి సంబంధిత వ్యాధులకు గురవుతున్న మత్స్యకారులకు పింఛన్లు అందిస్తామన్న ప్రభుత్వ హామీ బుట్టదాఖలైంది. సరిగ్గా వేట సాగక ఏటా వేలాది మంది మత్స్యకారులు కుటుంబాలను గ్రామాల్లో విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు వలసపోతున్నారు. స్థానికంగా ప్రత్యామ్నాయ ఉపాధి లేక కొంతమంది రహదారుల పక్కన కళ్లద్దాలు, బొమ్మలు విక్రయిస్తున్నారు. కనీసం మత్స్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కూడా జరగని దుస్థితి. పక్క గ్రామాలు, మైదాన ప్రాంతాల్లోనైనా ఉపాధి పనులు కల్పించాలని మత్స్యకారులు ఎప్పటి నుంచో కోరుతున్నా ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం స్పందించి స్థానికంగా ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ప్రత్యేక దృష్టి..
మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జెట్టీల నిర్మాణానికి సైతం సన్నాహాలు చేస్తోంది. వేట నిషేధ సమయంలో అర్హులందరికీ మత్స్యకార భరోసా అందించింది. అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం డీజిల్ రాయితీని సైతం ప్రకటించింది.
- సత్యంనారాయణ, మత్స్యశాఖ డీడీ, శ్రీకాకుళం
వేటకు వెళ్తేనే పూట గడిచేది
వేటకు వెళ్తేనే కుటుంబానికి పూట గడిచేది. తుఫాన్లు, వాతావరణం సరిగ్గా లేనప్పుడు రోజుల తరబడి ఇంటి వద్దే ఉండిపోతాం. కనీసం ఉపాధి హామీ పనులు ఉంటే కొంత ఇబ్బందులు తీరుతాయి. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఉపాధి పనులు పూర్తిస్థాయిలో కల్పించలేదు.
- ఎం.సత్తిరాజు, మత్స్యకారుడు, కొవ్వాడ
ఇబ్బందులు పడుతున్నాం
స్థానికంగా వేట గిట్టుబాటు కాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. తప్పనిసరైతే సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. ఉన్న గ్రామాల్లో కుటుంబాలను విడిచిపెట్టి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలో హార్బర్లు, జెట్టీల నిర్మాణం పూర్తిచేయాలి.
- ఆకుల రాముడు, చిన్నకొవ్వాడ, మత్స్యకారుడు
క్షేమంగా తీసుకువస్తాం : కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
ఉపాధి కోసం వలసబాట పట్టి.. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులను క్షేమంగా తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాధితులను స్వగ్రామాలకు తీసుకువచ్చే చర్యలను వేగవంతం చేశారు. బుధవారం రాత్రి ఈ సమస్యపై కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో చర్చించి పరిస్థితిని వివరించారు. బంగ్లాదేశ్‌లో ఉన్న ఇండియా మిషన్, కోస్ట్‌గార్డ్‌లతో నిరంతరం ఇదే విషయమై సంప్రదింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు నిరంతరం అధికారులతో మాట్లాడి.. మత్స్యకారులను జాగ్రత్తగా రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.