వేటకు వెళ్లి.. మత్స్యకారుడి మృతి
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:25 PM
fisherman dead సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొమర రాజయ్య శనివారం సముద్రంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.
భావనపాడు గ్రామంలో విషాదం
సంతబొమ్మాళి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొమర రాజయ్య శనివారం సముద్రంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. చేపలవేటలో భాగంగా రాజయ్య రోజూ మాదిరి తోటి మత్స్యకారులతో తీరప్రాంతానికి వెళ్లాడు. సముద్రం ఒడ్డున కర్రపాతి.. దానికి వలను కట్టాడు. మిగిలిన వలను కట్టేందుకు సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లగా ఆ సమయంలో పెద్దఎత్తున కెరటాలు వచ్చాయి. వాటి ఉధృతికి రాజయ్యతో వలతోపాటు చిక్కుకుని సముద్రంలో మునిగిపోయాడు. తోటి మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోవడంతో ఆయన మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. దీంతో రాజయ్య భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, బంధువులు బోరున విలపించారు. గ్రామస్థులు, మత్స్యకారులు విషాదంలో మునిగిపోయారు. నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి సంఘటన స్థలానికి చేరుకుని రాజయ్య మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మంత్రి అచ్చెన్న దిగ్ర్భాంతి
మత్స్యకారుడు కొమర రాజయ్య మృతిపై మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేటకు వెళ్లే మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.