Share News

సంప్రదాయ వలలకు చిక్కని చేపలు

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:02 AM

రింగువల, పెద్దవల, నారవల, జోగాలవల, తెప్ప, పడవ ఈ పేర్లు ఒకప్పుడు మత్స్యకార గ్రామాల్లో వినిపించేవి.

సంప్రదాయ వలలకు చిక్కని చేపలు
సంప్రదాయ వలలతో చేపల వేట చేస్తున్న నువ్వలరేవు మత్స్యకారులు

- మరబోట్ల ధాటికి సంద్రం లోపలకు ..

- నష్టపోతున్న సంప్రదాయ మత్స్యకారులు

- వలసబాట పడుతున్న వైనం

వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రింగువల, పెద్దవల, నారవల, జోగాలవల, తెప్ప, పడవ ఈ పేర్లు ఒకప్పుడు మత్స్యకార గ్రామాల్లో వినిపించేవి. ఇందులో పెద్దవల, రింగువల ఉన్న మత్స్యకారుడు గ్రామపెద్ద. ఎందుకంటే ఈ వలలకు అధిక మొత్తంలో చేపలు చిక్కడంతో ఆదాయం మస్తుగా ఉండేది. దీన్ని తోటి మత్యకారులందరికీ సమానంగా పంచిపెట్టేవాడు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మరబోట్ల ధాటికి సంప్రదాయ వలలకు చేపలు చిక్కడం లేదు. దీంతో ఈ వలలపై ఆధాపడే మత్స్యకారులు చేపలవేటను వీడి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. అక్కడ వలలు అల్లుకొని జీవనం సాగిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 11 మండలాల పరిధిలో 193 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 1,12,500 మంది మత్స్యకార జనాభా ఉన్నారు. వీరిలో 16 వేల మంది మత్స్యకారులు మోటరైజ్డ్‌, సంప్రదాయ పడవల్లో వేట సాగిస్తున్నారు. అయితే కాకినాడ, విశాఖపట్నం నుంచి కొందరు మత్స్యకారులు మరబోట్లతో జిల్లా తీరంలోకి ప్రవేశించి వేట సాగిస్తున్నారు. 8 నాటికల్‌ మైళ్ల లోపలే వారు చేపల వేట చేయాలనే నిబంధన ఉంది. కానీ, నిబంధనలు అతిక్రమించి ముందుకు వచ్చి వారు చేపలవేట చేస్తుండడంతో సంప్రదాయ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరబోట్ల ధాటికి చేపలన్నీ సముద్రంలోకి వెళ్లిపోతుండడంతో సంప్రదాయ వలలకు చేపలు చిక్కడం లేదు. ప్రతిఏటా సెప్టెంబరు ప్రారంభంలోనే టైగర్‌ రొయ్యలు సంప్రదాయ వలలకు దొరికేవని.. కానీ, ఈ ఏడాది ఇంతవరకు వలకు అవి చిక్కడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో ఈ వలలపై ఆధారపడే మత్స్యకారులు కుటుంబాలను విడిచి వలసబాట పడుతున్నారు. ఒక్క నువ్వలరేవు గ్రామంలోనే సగం మందివరకు వలస వెళ్లారని గ్రామస్థులు చెబుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలోని 11 పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉందని మత్స్యకార నాయకులు అంటున్నారు. మరబోట్లను నియంత్రించాలని గతంలో అనేకసార్లు పోరాటాలు చేసినా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు. కనీసం ఉపాధి పథకం ద్వారా పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా మరబోట్ల పరిధిని నిర్ణయించి, వాటిని నియంత్రించాలని కోరుతున్నారు.

ఉపాధి అవకాశాలు పెంపొందించాలి

మత్స్యకార గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. సంప్రదాయ వలలకు చేపలు చిక్కకపోవడంతో చాలామంది మత్స్యకారులు వలస పోతున్నారు. నువ్వలరేవు గ్రామం నుంచి గోవా, ముంబాయి వంటి ప్రాంతాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. మరబోట్ల కారణంగా సంప్రదాయ వలలకు చేపలు చిక్కకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది.

-పూర్ణ, సర్పంచ్‌, నువ్వలరేవు

మరబోట్లను అరికట్టాలి

మరబోట్లు తీరానికి వచ్చి చేపల వేట చేస్తుండడంతో సంప్రదాయ మత్స్యకారులు నష్టపోతున్నారు. ఐదు కిలో మీటర్ల లోపలే మరబోట్లతో చేపల వేట సాగించాలనే నిబంధన ఉన్నా పట్టించుకోడం లేదు. గతంలో అనేకసార్లు మరబోట్ల మత్స్యకారులతో గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా వాటిని అరికట్టాలి.

-వెంకటేష్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, నువ్వలరేవు

Updated Date - Sep 18 , 2025 | 12:02 AM