పాత పోలీసు స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:10 AM
స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత పోలీసుస్టేషన్ ఆవరణలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.

నరసన్నపేట, మార్చి 10(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత పోలీసుస్టేషన్ ఆవరణలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ ముక్క వేయడంతో ఈ ప్రమాదం జరగడంతో ఆవరణలో ఉన్న చెత్త, చెట్ల కొమ్మలకు నిప్పంటు కుంది. దీంతో ఆవరణలోని రెండు ప్రమాదాల్లో పట్టుబడిన వాహన సామగ్రి అగ్నికి ఆహుతైంది. వెంటనే హెచ్‌సీ దాలినాయుడు, పీసీ సింహాచలం స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే వారు వాహనం తో వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం జరిగిన సమీపంలోనే సీఐ, తహసీల్దార్ కార్యాలయాలున్నాయి.
రామకృష్ణాపురంలో జీడితోటల దగ్ధం
జలుమూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అంధవరం పంచాయతీ రామకృష్ణాపురంలో వంశధారనదీ తీరంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 100 ఎకరాలు పైబడి జీడి తోటలు దగ్ధమైనట్లు గ్రామస్థులు తెలిపారు. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఎగిసిపడి జీడితోటలు అగ్నికి ఆహుతయ్యా యన్నారు. నదిలో నీరు అందుబాటులో ఉండడంతో గ్రామస్థులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఏ రైతుకి ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. జీడితోటలు అగ్నికి ఆహుతి ఆవడంతో ఈ ఏడాది జీడి మామిడి పంటలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు.