Share News

బుడుమూరులో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:22 AM

బుడుమూరులో శుక్రవారం ఉదయం జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధమవ్వగా, మరో డాబా ఇల్లు పాక్షికంగా కాలి పోయింది.

బుడుమూరులో అగ్ని ప్రమాదం
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

  • మూడు పూరిళ్లు దగ్ధం.. పాక్షికంగా కాలిన మరో డాబా ఇల్లు

  • రూ.8 లక్షల ఆస్తి నష్టం

  • కాలిపోయిన మరో రూ.5 లక్షల నగదు

  • కట్టుబట్టలతో మిగిలిన బాధితులు

లావేరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): బుడుమూరులో శుక్రవారం ఉదయం జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధమవ్వగా, మరో డాబా ఇల్లు పాక్షికంగా కాలి పోయింది. వివరాల్లోకి వెళితే.. ముంత పైడిరాజు ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. పైడి రాజు ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ఆన్‌లో ఉండడంతో మంటలు వ్యాపించాయి. దీంతో పైడిరాజు ఇంటి పక్కనే ఉన్న శ్రీరాములు, గోపి ఇళ్లు కూడా అగ్ని కి ఆహుతవ్వగా.. వనం శ్రీనివాసరావుకి చెందిన డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. విషయం తెలుసుకున్న రణస్థలం అగ్ని మాపకం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ముంత శ్రీరాములు తమ కుమా ర్తె వివాహం కోసం దాచుకున్న రూ.5 లక్షల నగదు కాలిబూడిదవ్వగా, మరో రూ.8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. ఇల్లు కాలిపోయిన మూడు కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు.

విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు ఘటనా స్థలానికి చోరుకున్న బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.5వేలు చొప్పున్న అందజేయగా, తనవంతు మరికొంత మొత్తాన్ని అందజేశారు. తహసీల్దార్‌ జీఎల్‌వీ శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, కూటమి నాయకులు నల్లి లక్ష్మునాయుడు, పండి గోపాలరావు, పి.శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ సంస్ధ సౌజన్యంతో వంట సామగ్రి, దుస్తులు, టార్పలిన్లు అందించారు. సంస్ధ ప్రతినిధులు కె.సత్యనారాయణ, పి.చైతన్య కుమార్‌, సుజాత, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నియోజ కవర్గ వైసీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్‌, జడ్పీటీసీ టొంపల సీతారాం బాధిత కుటుంబాలను పరామర్శి, ఒక్కో కుటుంబానికి రైస్‌ ప్యాకెట్‌, దుస్తులు అందించారు.

Updated Date - Nov 01 , 2025 | 12:22 AM