టీడీవలసను వీడని జ్వరాలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:23 AM
: మండలంలోని డీటీవలస గ్రామాన్ని జ్వరాలు వీడటం లేదు. నెల రోజుల నుంచి గ్రామంలో చాలామంది కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, కాలు పొంగులు, దద్దుర్లతో బాధపడుతున్నారు.
- కీళ్ల నొప్పులు, దద్దుర్లతో ఇబ్బందులు పడుతున్న రోగులు
- నెల రోజులుగా ఇదే పరిస్థితి
-ఆసుపత్రులకు వెళ్లినా నయం కాని వైనం
జి.సిగడాం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డీటీవలస గ్రామాన్ని జ్వరాలు వీడటం లేదు. నెల రోజుల నుంచి గ్రామంలో చాలామంది కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, కాలు పొంగులు, దద్దుర్లతో బాధపడుతున్నారు. ప్రతి ఇంటిలో జ్వర బాధితులు ఉన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నా రోగాలు తగ్గడం లేదని గ్రామానికి చెందిన టంకాల రాంబాబు, టంకాల తిరుపతిరావు, టంకాల సాయమ్మ తదితర జ్వరపీడితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజల కిందట గ్రామంలో పలువురికి వైరల్ జ్వరాలు వచ్చాయన్నారు. గ్రామంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారులు వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు నిత్యం పారిశుధ్య పనులు, ఫాగింగ్, దోమల మందు పిచికారి చేస్తున్నా రోగాలు అదుపులోకి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి వైద్యాధికారులతో మెరుగైన వైద్యసేవలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పారిశుధ్యం మెరుగుపర్చాలి..
డీటీవలస గ్రామంలో డీపీవో సౌజన్య భార్గవి బుధవారం పర్యటించారు. పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎక్కడా అపరిశుభ్రత కనిపించరాదని అన్నారు. మురికి కాలువల్లో పూడికలు తీయించి, పెంట కుప్పలను తొలగించి పరిశభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థులు కూడా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో గుంటముక్కల రామకృష్ణ, వైద్యాధికారి యశ్వంత్, గ్రామ సచివాలయ, వైద్య సిబ్బంది ఉన్నారు.
వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నాం
గ్రామంలో జ్వరాలు ప్రబలినప్పటి నుంచి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి రోగుల పరిస్థితిపై ఆరా తీసి మందులు అందిస్తున్నాం. అవసరమైన వారికి సెలైన్‌లు పెడుతున్నాం. వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో నిత్యం ఉంటున్నారు. రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందిస్తున్నాం.
-యశ్వంత్, వైద్యాధికారి, పీహెచ్‌సీ, జి.సిగడాం