ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకూడదు
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:29 PM
రైతులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తూ జిల్లాలో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు.
- కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ
నరసన్నపేట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తూ జిల్లాలో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ధాన్యం కొనుగోలులో దళారీల దందా’ అనే శీర్షికతో వెలుడిన కథనంపై ఆయన స్పందించారు. నరసన్నపేట మండలంలోని బొరిగివలస, సత్యవరం గ్రామాల్లో ‘రైతన్నా..మీకోసం’ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం నరసన్నపేటలోని రైతు సేవా కేంద్రం-2లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆర్‌ఎస్‌కే ద్వారా కొనుగోలు తీరును పరిశీలించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా అత్యంత పారదర్శకతతో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు షెడ్యూల్, ట్రక్‌షీట్లు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.