Share News

రైతే దేశానికి వెన్నెముక

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:18 PM

రైతే దేశానికి వెన్నెముకని ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, మామిడి గోవిందరావు అన్నారు.

 రైతే దేశానికి వెన్నెముక
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తి

- వారికి అండగా ఉంటాం

- లాభసాటి వ్యవసాయం చేయాలి

- ‘రైతన్నా మీకోసం’లో ఎమ్మెల్యేలు, అధికారులు

రైతే దేశానికి వెన్నెముకని ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గౌత శిరీష, మామిడి గోవిందరావు అన్నారు. వివిధ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో వారితో పాటు అధికారులు పాల్గొని మాట్లాడారు. రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలని, రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వినియోగించా లని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.

అన్నదాతల శ్రేయస్సు కోసం: బగ్గు

జలుమూరు (సారవకోట) నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అన్ని విధాల శ్రమిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుడితి, లక్ష్మీపురంలో మంగళవారం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల కోసం అమలు చేస్తున్న రాయితీలు, సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త బగ్గు అర్చన, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, సారవకోట సొసైటీ అధ్యక్షుడు సురవరపు తిరుపతిరావు, జలుమూరు మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు తర్ర బలరాం, క్లస్టర్‌ ఇన్‌చార్జి పట్ట ఉమామహేశ్వరరావు, సర్పంచ్‌ పొదిలాపు కృష్ణ, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రైతులకు అగ్ర తాంబూలం: శిరీష

పలాసరూరల్‌/హరిపురం/వజ్రపుకొత్తూరు, నవం బరు 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతుల కు అగ్రతాంబులం వేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మం డలాల్లోని గురుదాసుపురం, అంబుగాం, చిన్న డోకు లుపాడు గ్రామాల్లో మంగళవారం రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆధునిక వ్యవసాయం, మెలకువలు నేర్చుకోవాలని, లాభసాటి వ్యవసాయం చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే శివారు ప్రాంతాలకు వంశధార నీరు అందించామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే డబ్బులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు, మూడు మండలాల టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రైతు అభ్యున్నతే ధ్యేయం:ఎంజీఆర్‌

పాతపట్నం/రూరల్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సింగుపురం, లాబర గ్రామాల్లో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు అగ్రిటెక్‌ సేవలందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలు అందించిన వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

లాభసాటి పంటలపై అవగాహన:జేసీ

నరసన్నపేట, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రైతులకు లాభసాటి పంటల సాగుపై వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ అఽదికారులు సంయుక్తంగా అవగాహన కల్పించాలని జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ ఖాన్‌ సూచించారు. మంగళవారం బొరిగివలస, సత్యవరం గ్రామాల్లో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పొందరకురాకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ డి.నర్సింహులు, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఏవో సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి: ఆర్డీవో

లావేరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కె.సాయిప్రత్యూష అన్నారు. బుధవారం గురుగుబిల్లిలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.



Updated Date - Nov 25 , 2025 | 11:18 PM