Share News

Market robbed: రైతులను దోచేస్తున్నారు!

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:52 PM

Traders' mood in Sripuram market శ్రీపురం కూరగాయాల మార్కెట్‌లో వ్యాపారుల దందా సాగుతోంది. సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. తాము మాత్రం రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు.

Market robbed: రైతులను దోచేస్తున్నారు!
శ్రీపురం వద్ద కూరగాయల మార్కెట్‌

  • కిలో రూ.30కి కొనుగోలుచేసి రూ.60 పైగా విక్రయం

  • శ్రీపురం కూరగాయల మార్కెట్‌లో వ్యాపారుల హవా

  • గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న అన్నదాతలు

  • శీతల గిడ్డంగి నిర్మించాలని వినతి

  • శ్రీపురం కూరగాయాల మార్కెట్‌లో వ్యాపారుల దందా సాగుతోంది. సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. తాము మాత్రం రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పంటను మార్కెట్‌కు తెచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతుండగా.. వ్యాపారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

  • కోటబొమ్మాళి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి మండలంలో చీపుర్లపాడు, చిన్నసాన, రేగులపాడు, కోటబొమ్మాళి, తర్లిపేట, జియ్యన్నపేట, సరియాబొడ్డపాడు, అక్కయ్యవలస, వాండ్రాడ, కురుడు, కన్నేవలస, విశ్వనాథపురం, నీలంపేట, మాసాహెబ్‌పేట, కొత్తపల్లి, సరియాపల్లి, సౌడాం, దుప్పిలపాడు, ఎత్తురాఽళ్ళపాడు, పొడుగుపాడు తదితర గ్రామాల్లో కూరగాయలను అధికంగా పండిస్తున్నారు. క్యాబేజీ, కాలీప్లవర్‌, క్యారెట్‌, బీర, బెండ, టమోట, కాకర, ఆనప, వంగ, దొండ, పొడువు చిక్కుడు, పొట్టి చిక్కుడు తదితర కూరగాయలను కోటబొమ్మాళి మండలం శ్రీపురం మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ వ్యాపారుల హవా నడుస్తోంది. ప్రస్తుతం బయట మార్కెట్‌లో ఏ కూరగాయ చూసినా కిలో రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. ఇక్కడ మాత్రం రైతులకు ఇందులో సగంధర కూడా గిట్టుబాటు కావడం లేదు. కొత్తపేట, కోటబొమ్మాళి, టెక్కలికి చెందిన కొందరు వ్యాపారులు గంపలు, బ్యాగులతో మొత్తంగా తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం అదే సరుకును బరంపురం, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాలకు లారీల్లో ఎగుమతి చేసి జేబులు నింపుకుంటున్నారు. కష్టపడి పండించిన తమకు కిలో రూ.30 నుంచి రూ.40 కూడా గిట్టుబాటు కావడం లేదని, వ్యాపారులు మాత్రం రూ.60 నుంచి రూ.100 పైగా అమ్ముకుంటున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో కూరగాయలు నిల్వ ఉంచేందుకు శీతలీకరణ గిడ్డంగి లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన రేటుకే అమ్ముతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల సిండికేట్‌పై అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. కేంద్రమాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 2003లో శ్రీపురం కూరగాయల మార్కెట్‌లో శీతలగిడ్డంగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా శీతలగిడ్డంగి మాత్రం నిర్మాణం కాలేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు స్పందించి శీతలగిడ్డంగి నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

  • శ్రమఎక్కువ.. గిట్టుబాటు తక్కువ

  • ప్రస్తుత వాతావరణంలో కూరగాయలు పండించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తోంది. మందులకు అధిక ఖర్చవుతోంది. మార్కెట్‌లో మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎంతోకొంతకు వ్యాపారులకు విక్రయిస్తున్నాం.

    - వాయిలపల్లి శశిభూషణరావు, ఊడికలపాడు

  • ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

  • వ్యయప్రయాసతో పండించే కూరగాయలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే నేరుగా కూరగాయలను కొనుగోలు చేసి పట్టణాల్లో ఉన్న రైతుబజార్లకు తరలించాలి. కూరగాయల రైతులను గుర్తించి సబ్సిడీపై విత్తనాలు, పురుగు మందులు అందజేయాలి. గిట్టుబాటు ధర లభించే వరకు నిల్వ ఉంచేలా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి.

    - పైడి అర్జునరావు, చీపుర్లపాడు

Updated Date - Aug 20 , 2025 | 11:52 PM