Share News

PACS Services : ఊరికి దూరం.. సేవలు నిరుపయోగం

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:54 PM

PACS warehouses are in vain వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు పండించిన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులను దాచుకునేందుకు వీలుగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు (పీఏసీఎస్‌) సంబంధించి గోదాములు నిర్మించారు. కానీ అవి గ్రామాలు, పట్టణాలకు దూరంగా రక్షణ లేని ప్రాంతాల్లో నిర్మించడంతో నిరుపయోగంగా ఉన్నాయి.

PACS  Services : ఊరికి దూరం.. సేవలు నిరుపయోగం
మెళియాపుట్టిలో ఊరికి దూరంగా ఉన్న పీఏసీఎస్‌ గోదాము

  • వృథాగా పీఏసీఎస్‌ గోదాములు

  • వైసీపీ సర్కారు నిర్వాకం.. రైతులకు శాపం

  • ప్రక్షాళన చేస్తున్న కూటమి ప్రభుత్వం

  • ఇచ్ఛాపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు పండించిన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులను దాచుకునేందుకు వీలుగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు (పీఏసీఎస్‌) సంబంధించి గోదాములు నిర్మించారు. కానీ అవి గ్రామాలు, పట్టణాలకు దూరంగా రక్షణ లేని ప్రాంతాల్లో నిర్మించడంతో నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వైసీపీ హయాంలో 25 గోదాములు నిర్మించాలని భావించారు. 18 గోదాముల నిర్మాణాన్ని పూర్తిచేశారు. 5 వివిధ దశల్లో ఉన్నాయి. మరో రెండు స్థల సమస్య కారణంగా నిర్మాణానికి నోచుకోలేదు. 500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఈ గోదాము ఒక్కోదానికి రూ.40లక్షలు ఖర్చుచేశారు. అంటే 25 గోదాములకు రూ.10కోట్లు అన్నమాట. కానీ ఈ గోదాములేవీ వినియోగంలోకి తేకపోవడంతో లక్ష్యం దెబ్బతింది. నిర్మాణ బాధ్యతలు మార్కెటింగ్‌ శాఖ చూసింది. కానీ సహకార శాఖ మాత్రం వినియోగించలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • పూర్తిగా నిర్వీర్యం

  • ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి . రైతుభరోసా కేంద్రాల పేరిట పీఏసీఎస్‌లను నిర్వీర్యం చేశారు. వైసీపీ పాలనలో చాలా ప్రాథమిక సహకార సంఘాల్లో అక్రమాలు బయటపడ్డాయి. కేవలం కంప్యూటరీకరణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పీఏసీఎస్‌ల బలోపేతానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తోంది. అధికారులు ఆన్‌లైన్‌లో రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రతి రైతుకు ఈకేవైసీ చేసి వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు ఆయా సొసైటీల వివరాలు, లావాదేవీలకు సంబంధించి దస్త్రాలు వెళ్లాయి. సహకార సంస్థ, గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయంతో ఈకేవైసీ పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నారు.

  • ఇదీ పరిస్థితి

  • జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,01,671 మంది సభ్యులు ఉన్నారు. గతంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతు సేవలో తరించేవి. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. తొలుత ఎటువంటి రుసుం చెల్లించకుండానే..రైతులు ఈ సంఘాల ద్వారా పంట రుణాలు, ఎరువులు పొందేవారు. పంట ఉత్పత్తులు విక్రయించిన తరువాత రుణాలు చెల్లించేవారు. కొద్దిరోజుల తరువాత సభ్యత్వ రుసుం కింద రూ.10వసూలు చేసేవారు. సంఘ సభ్యులుగా చేర్చుకునేవారు. ప్రాంతీయ వ్యవసాయ కోఆపరేటివ్‌ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేవారు. ప్రస్తుతం పీఏసీఎస్‌ల్లో రైతుల సభ్యత్వం తగ్గిపోయింది. సభ్యత్వ రుసుం ఏకంగా రూ.300కు పెరిగింది. ప్రస్తుతం పీఏసీఎస్‌లకు కూటమి ప్రభుత్వం పాలకవర్గాలను నియమించింది. త్రిమెన్‌ కమిటీల నియామకం పూర్తిచేసింది. అందుకే గతం మాదిరిగా సేవలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. అన్నింటికీ మించి రైతుల కోసం నిర్మించిన గోదాములను వినియోగంలోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • నివేదిక అందజేశాం

  • జిల్లావ్యాప్తంగా 37 పీఎసీఎస్‌లు ఉన్నాయి. గతంలో 25 గోదాముల నిర్మాణం చేపట్టాలని భావించాం. కానీ వివిధ కారణాలతో 18 గోదాముల నిర్మాణం పూర్తయింది. కొన్ని గోదాములు వినియోగంలోకి రాకపోవడం నిజమే. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ప్రస్తుతం జిల్లాలోని పీఏసీఎస్‌ల్లో కంప్యూటరీకరణ కొలిక్కి వచ్చింది.

    - మురళీకృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి, శ్రీకాకుళం

Updated Date - Sep 18 , 2025 | 11:54 PM