Share News

Train accident : ‘ఫలక్‌నుమా’కు తప్పిన ముప్పు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:11 AM

train incident risk పలాస రైల్వేస్టేషన్‌ నుంచి మంగళవారం ఉదయం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12704) రైలు బయలుదేరిన 20నిమిషాల వ్యవధిలో(7.15 గంటల సమయంలో) సుమ్మాదేవి లెవెల్‌క్రాస్‌ గేట్‌ వద్ద బోగీలను కలిపే ఐరన్‌ బఫర్‌ విరిగిపోయింది. మొత్తం 23 బోగీల్లో సుమారు 2వేల మందికిపైగా ప్రయాణిస్తున్నారు. కాగా.. ఏ-1 ఏసీ కోచ్‌ బోగీ వద్ద బఫర్‌ విరిగిపోవడంతో రైలుపట్టాలపై 15 బోగీలు ఉండిపోయాయి.

Train accident : ‘ఫలక్‌నుమా’కు తప్పిన ముప్పు
సుమ్మాదేవి లెవెల్‌క్రాస్‌ గేట్‌ వద్ద రైలు నిలిచిపోవడంతో నిరీక్షిస్తున్న ప్రయాణికులు (ఇన్‌సెట్‌లో..) రైలు బోగీలను కలిపే బఫర్‌ విరిగి పడిపోయిందిలా..

  • బఫర్‌ విరిగి పట్టాలపై నిలిచిన 15 బోగీలు

  • ఇంజనుతో పాటు 8 బోగీలు వెళ్లిపోయిన వైనం

  • అప్రమత్తమైన గార్డు, డ్రైవర్‌

  • ఉన్నతాధికారుల చొరవతో మరమ్మతులు

  • పలాస రైల్వేస్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో సుమ్మాదేవి రైల్వేగేటు వద్ద మంగళవారం సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా(12704) రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలుబోగీలను కలిపే బఫర్‌ విరిగిపోవడంతో 15 బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. రైలు ఇంజన్‌తో లింక్‌ ఉన్న 8 బోగీలు వెళ్లిపోయాయి. బఫర్‌ విరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో వెనుకన ఉన్న గార్డ్‌ పరిశీలించి.. డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే రైలు నిలుపుదల చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు, సిబ్బంది సంఘట స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటన నేపథ్యంలో సుమారు మూడు గంటలపాటు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

  • పలాస, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్‌ నుంచి మంగళవారం ఉదయం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12704) రైలు బయలుదేరిన 20నిమిషాల వ్యవధిలో(7.15 గంటల సమయంలో) సుమ్మాదేవి లెవెల్‌క్రాస్‌ గేట్‌ వద్ద బోగీలను కలిపే ఐరన్‌ బఫర్‌ విరిగిపోయింది. మొత్తం 23 బోగీల్లో సుమారు 2వేల మందికిపైగా ప్రయాణిస్తున్నారు. కాగా.. ఏ-1 ఏసీ కోచ్‌ బోగీ వద్ద బఫర్‌ విరిగిపోవడంతో రైలుపట్టాలపై 15 బోగీలు ఉండిపోయాయి. ఇంజన్‌తో పాటు 8 బోగీలు ముందుకు వెళ్లిపోయాయి. ఎవరో రైలు చైన్‌ లాగి ఉంటారని భావించి.. బోగీ చివరన ఉన్న గార్డు మధుకుమార్‌(విశాఖపట్నం) రైలు దిగి పరిశీలించారు. రైలుకు ఉన్న ఇంజనుతో పాటు బోగీలు ముందుకు వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. అనంతరం లోకో పైలెట్‌(డ్రైవర్‌) ఆర్‌.ఖాన్‌కు సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించి రైలును నిలిపేశారు. ఖుర్దారోడ్‌ వైపు వెళ్తున్న పట్టాలు ఎత్తులో ఉండడం.. రైలు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్లడంతో దాన్ని ఆపడం సాధ్యమైంది. సాధారణంగా ఫలక్‌నుమా రైలు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అదేస్పీడుతో రైలు వెళ్లిఉంటే ప్రమాదం చోటుచేసుకుని ఆస్తి, ప్రాణనష్టం భారీగా జరిగేది. పైలెట్‌, గార్డ్‌ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పలాస రైల్వే డిప్యూటీ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ భగవతిరావు, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌, ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ మాల్యాద్రి, మందస స్టేషన్‌ సూపరింటెండెంట్‌ గంటా హరిగోపాల్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి ఉన్నతాధికారులకు వివరించారు. రైలుకు మరమ్మతులు చేసిన తరువాత సాధారణ స్థితికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • భారీ శబ్దంతో అప్రమత్తం

  • పలాస రైల్వేస్టేషన్‌ దాటి పది నిమిషాల నుంచి బోగీల ద్వారా భారీ శబ్దాలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. రైలు బోగీలను కలిపే బఫర్‌ తెగిపోగా రెండింటిని కలిపే వ్యాక్యూమ్‌ ఎఫ్‌బీ(ఫీడ్‌పైప్‌), బీపీ(బ్రేక్‌పైపు)ల సహాయంతో ఐదు కిలోమీటర్ల వరకూ రైలు ముందుకెళ్లింది. అనంతరం బఫర్‌ పూర్తిగా విరిగి కింద పడిపోవడంతో మొత్తం వ్యవస్థ అంతా ధ్వంసమైంది. వెనుక ఉన్న 15 బోగీలు ఆగిపోయాయి. వ్యాక్యూమ్‌ వ్యవస్థ లేకపోతే ప్రమాదం ఊహించడం కష్టమేనని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.

  • 3 గంటలపాటు నిలిచిన ఫలక్‌నుమా:

  • సున్నాదేవి రైలుట్రాక్‌పై ఫలక్‌నుమా రైలు 2 గంటలు, మందస రైల్వేస్టేషన్‌లో గంటపాటు నిలిచిపోయింది. బఫర్‌ విరిగిన తరువాత రైలు ఇంజనుతో పాటు వేరయిన బోగీలను మందసలో నిలిపేశారు. అనంతరం అదే రైలు ఇంజను సహాయంతో పట్టాలపై నిలిచిన బోగీలను మందస వరకూ తీసుకువెళ్లారు. అక్రడ ప్రమాదానికి కారణమైన ఏ-1 ఏసీ కోచ్‌ బోగీని వేరు చేశారు. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులకు వేరువేరు బోగీల్లో సీట్లు సర్దుబాటు చేసి మందస నుంచి భువన్వేశర్‌ వరకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారందరికీ భువనేశ్వర్‌లో ఏసీ-2 టైర్‌ కోచ్‌ను ఏర్పాటు చేశామని రైల్వే ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రమాదం జరిగిన తరువాత బరంపురం, ఇచ్ఛాపురం వెళ్తున్న ప్రయాణికులు కొంతమంది రైలుదిగి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు.

  • అనేక రైళ్లు ఆలస్యం

  • ఫలక్‌నుమా రైలు బఫర్‌ విరిగిన నేపథ్యంలో పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, బరంపురం, ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ల్లో అనేక రైళ్లను నిలిపేశారు. 12242 దురంతో సూపర్‌ఫాస్ట్‌ రైలును పలాసలో నిలుపుదల చేసి పది గంటల తరువాత దాన్ని విడిచిపెట్టారు. భువనేశ్వర్‌ పాసింజర్‌ రైలును పలాసలో నిలుపుదల చేసి మూడు గంటల తరువాత దాన్ని పంపించారు. గూడ్స్‌ రైళ్లన్నీ వివిధ ప్రాంతాల్లోకి తరలించారు. 10.30 గంటల తరువాత సాధారణ స్థితికి చేరుకున్న తరువాత మొత్తం రైళ్లన్నీ యథాతఽథంగా నడిచాయి.

Updated Date - Apr 09 , 2025 | 12:11 AM