Share News

Fake sadaram: నకిలీల సదరం

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:53 PM

Fake Disability Certificates వైసీపీ ప్రభుత్వ హయాంలో సకలాంగులకు దివ్యాంగులుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వ్యవహారంలో నలుగురు వైద్యులతోపాటు డేటాఎంట్రీ ఆపరేటర్‌పై కేసు నమోదు చేశామని నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

Fake sadaram: నకిలీల సదరం
నరసన్నపేట ఏరియా ఆసుపత్రి

  • నరసన్నపేటలో తప్పుడు దివ్యాంగప్రతాల జారీ

  • పోలీసులకు డీసీహెచ్‌ ఫిర్యాదు

  • నలుగురు వైద్యులు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌పై కేసు

  • శాఖాపరంగా నివేదిక కోరిన వైద్యవిధాన పరిషత్‌

  • నరసన్నపేట, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో సకలాంగులకు దివ్యాంగులుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వ్యవహారంలో నలుగురు వైద్యులతోపాటు డేటాఎంట్రీ ఆపరేటర్‌పై కేసు నమోదు చేశామని నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. 2022లో నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సదరంలో పొందురు మండలం తోలాపి గ్రామానికి చెందిన 24 మందికి దివ్యాంగుల సర్టిపికెట్‌లు ఇచ్చారు. వీటిలో 22 మంది అనర్హులకు వైద్యులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని తోలాపి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పొన్నాడ అప్పారావు 2023 ఏప్రిల్‌ 17న ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్‌ ఆదేశాల మేరకు టెక్కలి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూర్యారావు దర్యాప్తు చేపట్టారు. 22 మందికి దివ్యాంగులుగా ఆర్థోపెడిక్‌ విభాగంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు నిర్థారించారు. దీనిపై అప్పటి డీసీహెచ్‌ రాజలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా నరసన్నపేట ఆసుపత్రిలోని సదరంలో కోటబొమ్మాళి, పొందూరు, జలుమూరు తదితర మండలాలకు చెందిన వారికి దివ్యాంగులుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. వీరంతా సామాజిక ఫించన్లు పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై లోతుగా విచారణకు ఆదేశించింది. దీంతో ఒకపక్క విచారణ జరుగుతుండగా, ప్రస్తుత జిల్లా ఆసుపత్రులు సమన్వయకర్త(డీసీహెచ్‌) డాక్టర్‌ కళ్యాణబాబు ఈ వ్యవహారంపై పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. అప్పట్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన ఆర్థోపెడిక్‌ వైద్యులు చల్లా మోహన్‌రవికిరణ్‌, ఈ పత్రాలపై రెండో డాక్టర్‌గా సంతకాలు చేసిన బాలక నవీన్‌, డా.నాగమళ్లీశ్వరి, అప్పటి సూపరింటెండెంట్‌ పి.జయశ్రీ, డేటాఎంట్రీ ఆపరేటర్‌ సి.శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. చార్జిషీటును కోర్టులో దాఖలు చేశామన్నారు.

  • వైద్యవిధాన పరిషత్‌ నోటీసులు

  • సదరంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ విషయంపై ఈ ఏడాది ఫిబ్రవరి 19న రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ డైరెక్టర్‌ అట్టాడ సిరి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించిన ఒక వైద్యుడు రాజకీయ అండతోనే శాఖపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకట్టు వేశారని సమాచారం. తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేయడంతో వైద్యులు పరుగులు పెడుతున్నారు. కొందరు తామేమి తప్పు చేయలేదని.. ఈ వ్యవహారంలో డిజటల్‌ కీ ఉపయోగించి అంగవైకల్యం నిర్ధారించే డాక్టర్‌, డేటా ఆపరేటర్‌ కలిపి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని ఆరోపిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. తమను కాపాడేందుకు సమీప బంధువులు ఉన్నారని.. కొందరు వైద్యులు డాంభీకాలు చెబుతున్నారు.

  • అజ్ఞాతంలో డేటా ఆపరేటర్‌

  • నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో సదరంలో నకిలీ దివ్యాంగుల పత్రాలు జారీ వ్యవహారం బయటపడిన తరువాత డేటా ఆపరేటర్‌ సి.శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ఈ వ్యవహారాన్ని డేటా ఆపరేటర్‌ మీదకు నెట్టేసి.. తప్పించుకునేందుకు కొంతమంది వైద్యులు కథ నడిపిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Apr 30 , 2025 | 11:53 PM