కంటి ఆపరేషన్ చేస్తే.. ఉన్నచూపు పోయింది
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:54 PM
Complaint against doctor's negligence కోటబొమ్మాళి మండలం జర్జంగికి చెందిన జీరు ఎర్రయ్య.. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా తనకు కంటి చూపు పోయిందని ఆరోపించారు. దీనిపై సూపరింటెండెంట్‌కు శనివారం ఫిర్యాదు చేశారు.
- జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యంపై ఫిర్యాదు
టెక్కలి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి మండలం జర్జంగికి చెందిన జీరు ఎర్రయ్య.. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా తనకు కంటి చూపు పోయిందని ఆరోపించారు. దీనిపై సూపరింటెండెంట్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జీరు ఎర్రయ్య తనకు కంటిచూపు మందగించిందని టెక్కలిలో జిల్లా కేంద్రాసుపత్రిలో సెప్టెంబరు 16న నేత్రవైద్యుడు ఎన్.శ్రీకాంత్‌కు చెప్పారు. ఆయన సూచన మేరకు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇంటికి వెళ్లిపోయిన నాలుగు రోజుల తర్వాత ఎర్రయ్య కంటి నుంచి నీరు కారుతూ వాపు కనిపించింది. దీంతో ఎర్రయ్య మరోసారి సెప్టెంబరు 22న కంటి వైద్యులు వద్దకు వచ్చి చూపించాడు. దీంతో మళ్లీ 25న కంటి ఆపరేషన్ చేశారు. నీరు కారడం, వాపు నెమ్మదిగా తగ్గుతుందని వైద్యుడు తెలిపారు. కాగా రీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అదే పరిస్థితి. దీంతో ఎర్రయ్య తన కుమారుడు కిషోర్‌ను వెంటబెట్టుకొని విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్ష చేయించారు. మీకు ఎన్నిచేసినా కన్ను కనిపించదని ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎర్రయ్య, ఆయన కుటుంబ సభ్యులు శనివారం టెక్కలిలో జిల్లా కేంద్రాసుపత్రికి చేరుకుని వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా తనకు ఉన్న చూపు పోయింందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.సూర్యారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయమై కంటి వైద్య నిపుణులు ఎన్.శ్రీకాంత్ వద్ద ప్రస్తావించగా.. ‘ఎర్రయ్యకు కంటి ఆపరేషన్ చేశాం. కుట్లు తీసేటప్పుడు బ్లీడింగ్ జరిగింది. మరోసారి కంటి నరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. హెచ్‌వోడీ సెలవుపై ఉన్నందున ఆయనతో మాట్లాడిన తరువాత పరిశీలిస్తామ’ని తెలిపారు.