Pacs : మళ్లీ నిరాశే
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:08 AM
Governance extension ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో(పీఏసీఎస్) కొన్నాళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగనుంది. అధికార పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని జూలై 30 వరకు పొడిగిస్తూ.. సహకారశాఖ కమిషనర్ బి.రాజశేఖర్ ఈనెల 20న ఉత్తర్వులు జారీచేశారు.
పీఏసీఎస్‌ల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగింపు
సొసైటీలకు మరో 40 రోజులు ఇన్‌చార్జిలే దిక్కు
ఎన్నికల కోసం ఆశావహుల ఎదురుచూపు
నరసన్నపేట, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో(పీఏసీఎస్) కొన్నాళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగనుంది. అధికార పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని జూలై 30 వరకు పొడిగిస్తూ.. సహకారశాఖ కమిషనర్ బి.రాజశేఖర్ ఈనెల 20న ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో నిరాశ కనిపిస్తోంది. జిల్లాలో 49 పీఏసీఎస్‌లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది జూలైలో ఆరునెలలు కాలానికి పర్సన్ ఇన్‌చార్జిలుగా 49 మంది ప్రత్యేకాధికారులను నియమించింది. గతేడాది డిసెంబరు 20న పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలం ముగిసింది. అప్పట్లో (డిసెంబరు 19న) ఆరునెలల పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ సహకారశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ గడువు శుక్రవారంతో ముగియగా.. మరో 40 రోజులపాటు పదవీ కాలాన్ని పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీచేయడంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది. ప్రభుత్వం ఇటీవల డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్లను నియమించింది. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రతీ సొసైటీ పరిఽధిలో ఎన్నికలు నిర్వహించి చైర్మన్‌ను, సభ్యులను ఎన్నుకోవడం లేదా గత ప్రభుత్వం మాదిరిగా త్రిసభ్య కమిటీలను వేస్తారని కూటమి నేతలు, ఆశావహులు ఎదురు చూశారు. కాగా.. అధికారుల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో నిరాశ చెందుతున్నారు. ఇటీవల బదిలీల్లో భాగంగా పలు సొసైటీల్లో కొత్త అధికారులు చేరారు. వారంతా వచ్చే నెల 30వరకు పీఏసీఎస్‌ల్లో ప్రత్యేకాధికారులుగా కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి 40రోజులు మాత్రమే ప్రత్యేకాధికారుల పాలన గడువు పొడిగించడంతో.. ఆగస్టులో సహకార సంఘాలకు కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ నియామకంతో దిగువ సంఘాలకు కమిటీలు వస్తాయని ఆశావహులు అంచనా వేస్తున్నారు. సహకార సంఘాలకు ఎన్నిక అనేది ప్రశ్నార్థకంగా మారింది. కమిటీల నియామకం తర్వాతే ఎన్నికల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆరేళ్లుగా ఎన్నికల్లేవ్
సహకార సంఘాలకు దాదాపు అరేళ్లుగా ఎన్నికల లేవు. 2019 ముందు నుంచీ పాలక వర్గాల గడువు ముగిసింది. వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి త్రిసభ్య కమిటీల పేరుతో ముగ్గురు సభ్యులతో నామినేటెడ్ పదవులతో సరిపెట్టుకుంటూ వచ్చింది. ఐదేళ్లూ అదే విధానం కొనసాగించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యేక అధికారులు పాలన ఏడాది పాటు కొనసాగించింది. మళ్లీ 40 రోజులపాటు గడువు పొడిగించింది. ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కొక్క వ్యవసాయ పరపతి సంఘానికి ఒక చైర్మన్‌తో పాటు 12 మంది సభ్యులను ఎన్నుకుంటారు. జిల్లాలో 49 పీఏసీఎస్‌ల పరిధిలో 1,43,257 మంది రైతులు ఉన్నారు. వీరంతా ఆయా సంఘాల పరిధిలో సభ్యులను, చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఇటీవల నీటిసంఘాలకు నిర్వహించిన ఎన్నికల మాదిరిగా సొసైటీ పరిధిలోని రైతులు వీరిని ఎన్నుకుంటారు. ఎన్నికల ద్వారా అయితే చైర్మన్‌తో కలిపి 587 మంది కూటమి నాయకులకు పదవులు లభించే అవకాశం ఉంటుంది. లేకపోతే నామిటేడ్ ప్రాతిపధికన త్రిసభ్య కమిటీ సభ్యులనే నియమిస్తే జిల్లాలో 147 మందికి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహించాలా.. లేదా త్రిసభ్య కమిటీలను నియమించాలనే విషయంపై ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.